ఆయనొచ్చారు.. మహాకూటమి గెలుపు ఖాయమేనా?

0
611

డీకే శివకుమార్.. కాసింత రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవాళ్లకు ఈ పేరు కచ్చితంగా తెలిసే ఉంటుంది. కొన్ని రోజుల క్రితం కర్ణాటకలో జరిగిన ఎన్నికలు, ఫలితాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా డీకే శివకుమార్ పేరు మార్మోగింది. పోలింగ్ మొదలుకుని.. తీవ్ర నాటకీయ పరిణామాల మధ్య జేడీఎస్-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో డీకే పాత్ర 99% ఉందంటే ఎటువంటి అతిశయోక్తిలేదు. సీఎం పీఠంపై కన్నేసిన మోదీ, అమిత్ షా లాంటి రాజకీయ ఉద్ధండులను సైతం ధైర్యంగా ఢీకొన్నారంటే ఆషామాషీ విషయం అస్సలు కానేకాదు. ఎమ్మెల్యేలను మరీ ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడ్ని రేవణ్ణను మనవైపు తిప్పుకుంటే చాలు మనేదే సీఎం కుర్చీ అని ఎత్తులువేసిన బీజేపీకి.. పైఎత్తులు వేసి ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే చేజారిపోకుండా తన మాస్టర్‌ప్లాన్‌తో అధికారాన్ని ఏర్పాటు చేసే వరకు అన్నీ తానై ఉన్నారు.

అయితే ఈయన తెలివితేటలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం ఎలాగైనా సరే తెలంగాణలో సీఎం సీటు కైవసం చేసేలాగా ప్లాన్ వేయాలని సలహా ఇచ్చిందట. అందుకే పనిలో పనిగా రాష్ట్రంలో టికెట్లు రాని నేతలను బుజ్జగించేందుకుగాను వేసిన ఓ కమిటీలో సభ్యుడిగా చేర్చింది. ఆయన హైదరాబాద్‌కు వచ్చింది ఆలస్యం అసంతృప్త నేతలతో మీటింగ్ ఏర్పాటు చేయడం.. వారికి నచ్చజెప్పి పంపించడం ఇలా క్షణాల్లో పనులు చేసేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రజాకూటమి అధికారంలోకి తేవడానికి తనవంతుగా సహాయసాకారాలు చేయడానికి ప్లాన్లు సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే పలు సర్వేలు మహాకూటమిదే అధికారమని చెప్పడంతో అది కాస్త నిజం చేయడానికి అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అయితే రాజకీయ చాణక్యుడైన కేసీఆర్‌ను ఓడించడానికి డీకే ఏ మేరకు సక్సెస్ మంత్రను వాడతారో అన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

తెలంగాణ ఎన్నికల రంగంలోకి దిగిన డీకే.. ఇదిగో ఓ ప్రముఖ చానెల్ నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమంలో ఇలా ప్రత్యక్షమయ్యారు. ఆయనే పక్కనే కాంగ్రెస్‌లో తలపండిన నేతలు కేవీపీ, వీహెచ్, టి. సుబ్బిరామిరెడ్డి ఉన్నారు. తెలంగాణలో బిజీబిజీగా గడుపుతున్న డీకేను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తీసుకెళ్లిన టీఎస్సార్ సిద్ధాంతులతో ప్రత్యేక పూజలు సైతం నిర్వహించారు. కన్నడ నాట ఎన్నికల్లో చక్రం తిప్పిన డీకే.. తెలంగాణ నాట ఎంతమేరకు సక్సెస్ కాగలడో.. రాష్ట్రంలో ఆయన సక్సెస్ మంత్ర ఎంత మేరకు పనిచేస్తుందో డిసెంబర్-11న చూడాల్సిందే మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here