చంద్రబాబు కుటుంబీకుల డేటా లీక్ చేస్తే..!

will leak cm chandrababu family members data..!?

0
227

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న ‘డేటా చోరీ’ కేసులో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి అయిన ఐటీ గ్రిడ్ డైరెక్టర్ అశోక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు బృందాలుగా గాలిస్తున్నారు. ఈ తరుణంలో టీడీపీ-వైసీపీ మధ్యలో టీఆర్ఎస్ నేతలు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. తెలుగుదేశం, చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశం నిర్వహించారు.

భువనేశ్వరి, బ్రాహ్మణీల డేటా లీక్‌ చేస్తే ఊరుకుంటారా?
“డేటా లీకేజీ కేసుతో తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్‌ మూతపడింది. సమగ్ర విచారణ జరిగితే పార్టీ కూడా మూతపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎలాంటి ప్రాథమిక విచారణ కూడా జరగకుండా ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు విజయానంద్, అహ్మద్‌ బాబులు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి లీకేజీ జరగలేదని ఎలా చెబుతారు.? నారా చంద్రబాబు కుటుంబీకులైన నారా భువనేశ్వరి, బ్రాహ్మణిల ఫోన్‌ నంబర్లు, ఆధార్‌ నంబర్లు బయటపెడితే చంద్రబాబు ఊరుకుంటారా..?. మీ కుటుంబ సభ్యులకు ఉన్న హక్కే ప్రజలకు ఉండదా..? 3.5 కోట్ల ప్రజల సమాచారం గాల్లో పెట్టి ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ సీఈఓను తీసుకెళ్లి రక్షణ కల్పిస్తున్నారు. వాస్తవాలు బయటకు రాకుండా విచారణకు సహకరించకుండా ఎన్ని రకాలుగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారు” అని వాసిరెడ్డి పద్మ చెప్పుకొచ్చారు.

ఆ కంపెనీలకు ఎలా ఇస్తారు..!
“తెలుగుదేశం పార్టీ కుటుంబ వికాసం, సమాజ వికాసం కార్యక్రమం డిజైన్‌ బ్లూఫ్రాగ్‌ కంపెనీకి ఇచ్చారు. ఆ కార్యక్రమ డిజైన్‌ ఫైనల్‌చేయడానికి పంచాయతీ రాజ్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ నుంచి జీఓ 75 విడుదలైంది. ప్రభుత్వం నుంచి 25 శాఖలను జీఓ ద్వారా జతపరిచారు. 25 శాఖలకు చెందిన అధికారులు బ్లూఫ్రాగ్‌ టెక్నాలజీకి సంబంధించి డైరెక్ట్‌గా ఇన్వాల్స్‌ అయి ఉన్నట్లు జీవోలో ఉంది. ఐటీ గ్రిడ్స్‌కు బ్లూఫ్రాగ్‌ నుంచి సమాచారం అందిందని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఐటీ గ్రిడ్స్‌ సంస్థ టీడీపీ సేవామిత్ర యాప్‌ను తయారు చేసి నిర్వహిస్తుంది. బ్లూఫ్రాగ్, ఐటీ గ్రిడ్స్‌ సంబంధాలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వమే 25 శాఖలను ఇన్వాల్స్‌ కావాలని చెప్పినప్పుడు ప్రభుత్వ సమాచారం బయటకు రాలేదని అధికారులు ఎలా చెప్పగలుగుతున్నారు. విచారణ ఏమైనా చేయించారా..? విజయానంద్‌ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శిగా మాట్లాడుతున్నారా.. లేక టీడీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారా అని సచివాలయంలో ఎవరిని అడిగినా చెబుతారు” అని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.

జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా..!?
“ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టీడీపీ నేతలు వైసీపీపై పోలీసు కంప్లయిట్‌ ఇస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏపీ ప్రజల సమాచారం ఆధార్, బ్యాంక్‌ అకౌంట్ల వివరాలు, కులం వివరాలు ప్రైవేట్‌ కంపెనీ చేతుల్లోకి వెళ్లిందనే వివాదం నడుస్తోంది. మీరు విచారణ జరిపి ప్రభుత్వం నుంచి తప్పిదం లేదని ఫిర్యాదు చేయాలి. వైసీపీపై, ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు తగదాలా? ఫిర్యాదు చేసే దీనస్థితిలో టీడీపీ నేతలు ఉన్నారు. మీ చెప్పుచేతల్లో ఉన్న ఏపీ పోలీసుల నుంచి గుడ్‌ గవర్నెన్స్‌ అనే చిన్న సర్టిఫికెట్‌ కూడా తెచ్చుకోలేరని అర్థం అవుతుంది. ఫారమ్‌– 7 ఇచ్చిన వారిపై తిరగబడండి అని చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటు. జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా.. అని అనుమానం కలుగుతోంది. ఫారమ్‌ – 7 ఈసీ పౌరులకు ఇచ్చిన హక్కు. ప్రజాస్వామ్య హక్కులను చంద్రబాబు కాలరాస్తున్నాడు” అని పద్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చలానా చూపిస్తాం..
“ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ ద్వారా మొత్తం గవర్నమెంట్‌ ఇన్ఫర్మేషన్‌ బయటకెళ్తుందని ఫిబ్రవరి 21వ తేదీన వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కంప్లయింట్‌ ఇచ్చారు. చలానా కూడా చూపిస్తాం. టీడీపీ నేతలు మార్చి 2న ఫిర్యాదు చేశారు. కానీ 23వ తేదీనే ఐటీ గ్రిడ్స్‌పై సోదాలు చేశారని మాట్లాడుతున్నారు. ప్రజల సమాచారాన్ని రోడ్డు మీద పెట్టిన చంద్రబాబు తప్పు కప్పిపుచ్చుకోవడానికి మరో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు” అని వాసిరెడ్డి పద్మ చెప్పుకొచ్చారు.

సీఎం హెలికాఫ్టర్లలో ప్రయాణాలు..!?
బ్లూఫ్రాగ్, ఐటీ గ్రిడ్స్‌ కంపెనీల యాజమాన్యం, సీఈఓలు అనేక సార్లు సీఎం హెలికాప్టర్, విమానాల్లో ప్రయాణించలేదా..? నామినేషన్ల ప్రక్రియలో కోట్ల రూపాయల పనులు ఈ కంపెనీలకు అప్పగించారు. సొంత కంపెనీలను పెట్టుకొని చంద్రబాబు, లోకేష్‌ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల తీర్పును కూడా మేమే డిసైడ్‌ చేస్తామని చంద్రబాబు పొలిటికల్‌ మాఫియాగా అవతరిస్తే విచారణ జరగకూడదా..?” అని వాసిరెడ్డి ప్రశ్నించారు

ఇది అశోక్‌ బాబు స్టాండా.. టీడీపీ స్టాండా..?
“సీబీఐకి అప్పగిస్తే కాలయాపన చేయవచ్చు ఎన్నికల గండం తప్పించుకోవచ్చని ఎత్తుగడ వేస్తున్నారా.. ? సీబీఐ అంటే మీకొక పడని పాములా చూపించారు కదా.. మళ్లీ ఎందుకు సీబీఐ అంటున్నారు. ఇది అశోక్‌ బాబు స్టాండా.. టీడీపీ స్టాండా..? సీబీఐ ఎంక్వైరీ ఎప్పుడు జరిపిస్తారు..? ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. దీనిపై కనీస విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారంటే ఎంతకు తెగించారో ప్రజలంతా చూస్తున్నారు. అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్లు చేయడం. తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్‌ ఎందుకు మూతపడింది. వెబ్‌సైట్‌ కూడా మూతపడింది. రేపు పార్టీ కూడా మూతపడుతుంది” అని అని వాసిరెడ్డి జోస్యం చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here