నేరస్థులు చెబితే అధికారులను బదిలీ చేశారు: చంద్రబాబు

0
433

ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ నిర్వీర్యమైందంటూ ఢిల్లీ వేదికగా ధ్వజమెత్తారు. నేడు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రధాన అధికారి అరోరాను కలిసి రాష్ట్ర పరిస్థితిని, ఎన్నికల తీరును వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇన్ని అరాచకాలు ఏపీ చరిత్రలోనే లేవన్నారు. చీరాల వైసీపీ అభ్యర్థి చెబితే సాయంత్రానికి సీఎస్‌ని బదిలీ చేశారని, రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్‌ను నిర్వీర్యం చేయాలని చూశారని చంద్రబాబు మండిపడ్డారు. స్పీకర్ కోడెలతో పాటు అభ్యర్థులపై దాడులు, ఆంధ్రప్రదేశ్‌ని రావణకాష్టంగా మార్చాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ వైఫల్యం చెందిందని, ఈసీకి ఓటర్లు భిక్షగాళ్లలా కనిపిస్తున్నారా? అని మండిపడ్డారు. ఈవీఎంలపై ప్రతి ఒక్కరికి అనుమానాలున్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి ఎస్పీని బదిలీ చేశారని చంద్రబాబు ఆరోపించారు. వీవీ ప్యాట్లను లెక్కించేందుకు ఆరు రోజులు పడుతుందని.. సుప్రీంకోర్టు ఈసీకి ఎందుకు చెప్పిందని ప్రశ్నించారు. తమ పోరాట ఫలితంగానే వీవీ ప్యాట్లు వచ్చాయని, కానీ వాటిపై కూడా నమ్మకం లేకుండా చేశారన్నారు. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని.. ఇకపై ఈవీఎంలు వద్దని.. పేపర్ బ్యాలెట్లు కావాలన్నారు. రాష్టంలో జరిగిన అవకతవకలను దేశం మొత్తానికి చాటి చెబుతామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈవీఎంలు పని చేయకపోతే ప్రతిపక్ష నేత ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్షమే హింసకు పాల్పడింది కాబట్టే మాట్లాడలేదని చంద్రబాబు విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here