బాలకృష్ణ.. పెద్ద కమెడియన్: నాగబాబు సంచలన వ్యాఖ్యలు

0
448

తెలుగు రాష్ట్రాల్లో మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబును.. నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి అడగగా.. బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ చెప్పటం దుమారానికి తెరలేపింది. దీంతో బాలయ్య అభిమానులు నాగబాబు పై విరుచుకుపడ్డారు. అయినా కూడా నాగబాబు మరో వీడియో ద్వారా బాలకృష్ణ పై సెటైర్స్ వేస్తూ.. బాలకృష్ణ ఒక పెద్ద కమెడియన్ అంటూ సంచలనం సృష్టించాడు. నాగబాబు మాట్లాడిన తీరు సినీ, రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

నాగబాబు ఎలా అన్నారో యధావిధిగా చూద్దాం..
‘‘నిన్న నా ఫేస్‌బుక్ లైవ్‌లో ఒక తప్పిదం జరిగింది. నేను టీవీలు, యూట్యూబ్‌లు చూడను. నిన్న కొంతమంది నా ఫేస్‌బుక్‌లో బాలకృష్ణ గారి గురించి మాట్లాడమంటే ఆయనెవరో తెలియదన్నాను. తరువాత కొంతమంది ఫీలయ్యారని నాకు ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు. ‘అలా అనడం తప్పు కదా.. మీకు తెలియదా?’ అన్నారు. తెలియదనడం నిజంగా నా తప్పే. ఎందుకంటే బాలకృష్ణగారు తెలియని వాళ్లు ఎవరుంటారండి? బాలకృష్ణ గారు అందరికీ తెలుసు. ఆయన మంచి నటుడు.. ముఖ్యంగా ఆయన ఒక పెద్ద కమెడియన్. ఆయనంత కామెడీ చేసేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఆయన వెరీగుడ్ కమెడియన్. ఆయన ఆంగికాభినయాలు కానీ.. లేదంటే పెర్ఫార్మెన్స్‌తో కడుపుబ్బ నవ్విస్తారు. అలాంటి హాస్యనటుడు బాలకృష్ణగారిని నేను మరచిపోయాననడం నిజంగా నా తప్పే. పైగా ఆయన ఎన్టీఆర్‌తో కూడా యాక్ట్ చేసిన నటుడు.

ఈయనేనండి(ఫోటో చూపిస్తూ) వల్లూరి బాలకృష్ణగారు. ఈయనకు ఒక నిక్ నేమ్ కూడా ఉంది. ఆ నిక్‌నేమ్ ఏంటంటే.. అంజిగాడు. ఈయన కృష్ణగారి ‘అసాధ్యుడు’లో కూడా మంచి కామెడీ పాత్ర పోషించారు. చాలా చాలా హ్యాపీ. వల్లూరి బాలకృష్ణగారు.. ప్రముఖ సినీ హాస్యనటుడు అని వికిపీడియాలో కొడితే ఆయన గురించి వస్తుంది. మీరెవరైనా కావాలంటే వికిపీడియా ఓపెన్ చేసి చూసుకోండి. ఒక విషాదకరమైన వార్తేంటంటే.. ప్రస్తుతం ఆయన మన మధ్య లేరు. ఆయన మరణించి చాలా కాలం అయింది. ఆయన మరణించినా కూడా ఆయన సినిమాలు ఇప్పటికీ హాస్యాన్ని పంచుతూనే ఉంటాయి. ఆయన్ని మరచిపోవడం నేను చేసిన పెద్ద తప్పు. దాన్ని నేను సరిచేసుకుంటున్నా’’ అని అన్నారు. దీంతో ఈ వ్యవహారం కాస్త హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరి దీనిపై బాలయ్య బాబు రియాక్ట్ అవుతాడో! లేదో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here