బాలయ్య చెబుతున్న ఆ ‘బాహుబలి’ ఎవరబ్బా?

0
502

తెలంగాణ ఎన్నికల్లో ప్రజాఫంట్ గెలుపే లక్ష్యంగా టీడీపీ, కాంగ్రెస్, తెలంగాణ జనసమితి పార్టీలు ముందుకు దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో జాతీయస్థాయి నేతలు మొదలుకుని సినిమా స్టార్‌‌లను సైతం ఎన్నికల ప్రచారబరిలోకి దింపుతున్నారు. టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగారు. హైదరాబాద్‌‌లోని సనత్‌‌నగర్ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి కూన వెంకటేశ్ గౌడ్ తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడిన మాటలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అసలు బాలయ్య ఏమన్నారు..? ఎందుకు ఆ మాటలు హాట్ టాపిక్ అయ్యాయి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

టీడీపీ అధినేత చంద్రబాబు కట్టించిన బిల్డింగుల్లోనే ఇప్పుడు గులాబీ బాస్ కేసీఆర్ మీటింగ్స్ పెట్టుకుంటూ మళ్లీ ఆయన్నే విమర్శిస్తున్నారని బాలయ్య విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ మహానగరాన్ని చంద్రబాబే కట్టించారని ఆయన సెలవిచ్చారు. ఈ క్రమంలో బాలయ్యకు సడన్‌‌గా బాహుబలి సినిమా గుర్తొచ్చినట్లుంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా “బాహుబలి సినిమాలో రాజు భల్లాలదేవుడైనా.. ప్రజలందరూ బాహుబలినే గుర్తు పెట్టుకున్నారు” అని బాలయ్య డైలాగ్ పేల్చారు. అంటే బాలయ్య ఉధ్దేశ్యం ప్రకారం బాహుబలి ఎవరు..? భల్లాలదేవ ఎవరు? అని ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు యోచనలో పడ్డారు.

కాస్త క్లారిటీ ఇవ్వండి సారూ..!
సినిమాలో లాగా రియల్‌‌లైఫ్‌‌లో ఎవరు.. ఎవరితో కొట్లాడి అధికారం చేజిక్కిచ్చుకున్నారు..? ఎవరు రాజ్యాన్ని ఏలుతున్నారో బాహుబలి గురించి మాట్లాడిన బాలయ్యకే ఎరుక. పోనీ బాలయ్య చెప్పినట్లే ఇక్కడ బాహుబలి చంద్రబాబా..? లేకుంటే కల్వకుంట్ల చంద్రశేఖరా..? దీన్నే కాస్త రివర్స్ చేసినట్లయితే భల్లాలదేవ కేసీఆరేనా..? లేకుంటే అప్పట్లో తన తండ్రికి వెన్నుపోటు పొడిచి.. పార్టీని, సీఎం పీఠాన్ని దక్కించుకున్న చంద్రబాబా..? అసలు ఇలాంటి విషయాలపై క్లారిటీ ఇవ్వకపోతే ఇలాగే టీడీపీ కార్యకర్తలకు, అభిమానులకు ఎనలేని సందేహాలు వస్తాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

అవునా.. ఇదేం లెక్క బాలయ్యా..!
ఇక బాలయ్య చెప్పినట్లుగా బిల్డింగ్‌‌ల గురించి మాట్లాడుకుంటే.. ప్రజలు ఎన్నుకునేదాన్ని బట్టి ప్రభుత్వాలు మారుతుంటాయ్. అంతమాత్రాన టీడీపీ వాళ్లు కట్టిన బిల్డింగ్స్‌‌లో కాంగ్రెసోళ్లు, టీఆర్ఎస్సోళ్లు పరిపాలించకూడదు.. విమర్శించకూడదంటే ఎలా సార్. అంటే ఎవరు కట్టిన బిల్డింగుల్లో నుంచి వారే కూర్చోవాలా..? మరి రేపొద్దున మహాకూటమి అధికారంలోకి వచ్చిందనుకోండి.. మీరు కేసీఆర్ కట్టిన బిల్డింగ్స్‌‌లో కూర్చొని విమర్శించరా..?. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయొచ్చు అందులో ఎలాంటి తప్పులేదు కానీ.. ఇలాంటి సిల్లీ వ్యాఖ్యలు చేసి.. నలుగురిలో నవ్వులపాలు కావడం మరీ దారుణమని రాజకీయ విశ్లేషకులు బాలయ్యకు సూచిస్తున్నారు.

అక్కడ లేయని నోరు.. ఇక్కడ లేస్తోందేం!
అంతటితో ఆగని బాలయ్య ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి మాట్లాడి పాపం.. సగం పరువు తీసుకున్నారు. మాజీ మంత్రి, సనత్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. టీడీపీ తరఫున గెలిచి పార్టీ ఫిరాయించిన వారికి ఓట్లతో బుద్ధి చెప్పండి.. తల్లి పాలుతాగి రొమ్ము గుద్దిన వాళ్లకు డిపాజిట్లు రాకుండా చూడండి అని ఆయన నియోజకవర్గ ప్రజలకు సెలవిచ్చారు. ఓకే.. మీరు చెప్పిన ప్రకారమే కాసేపు తెలంగాణను పక్కనెట్టి ఏపీ విషయానికొద్దాం.. మరీ ఏపీలో మీ బావగారు, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చేసిన పనేంటి..? మీరు చెప్పినట్లే తల్లిపాలు తాగి రొమ్మును గుద్దిన చందంగా.. వైసీపీ తరఫున గెలిచిన సుమారు 23మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తే మీరు నోరు మెదపరేం.. అక్కడ ఏపీలో లేయని నోరు.. ఇక్కడ తెలంగాణలో లేస్తోందేం..!. అందుకే పక్కనోడి వైపు ఒక వేలు చూపిస్తే మిగతా నాలుగువేళ్లు మనవైపు చూస్తుంటాయ్ సార్.. ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా..? కాసింత విచక్షణతో మాట్లాడితే అర్థవంతంగా, పరువు పోకుండా ఉంటుందని నెటిజన్లు, విశ్లేషకులు బాలయ్యకు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here