‘మళ్లీ మళ్లీ చూశా’ మూవీ రివ్యూ…

0
221

మూవీ పేరు: మళ్లీ మళ్లీ చూశా
విడుదలతేది: అక్టోబర్ 18, 2019
తారాగణం: అనురాగ్ కొణిదెన,శ్వేతా అవస్థి, కైరవి టక్కర్, అన్నపూర్ణమ్మ, అజయ్, మధుమణి, ప్రభాకర్, టి.ఎన్. ఆర్, మిర్చి కిరణ్, కరణ్, బాషా, ప్రమోద్, పావని, జయలక్మి, మాస్టర్ రామ్ తేజస్, బంచిక్ బబ్లూ, తదితరులు.
దర్శకత్వం : హేమంత్ కార్తీక్
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
ఎడిట‌ర్: సత్య గిడుతూరి
నిర్మాత‌: కె. కోటేశ్వరరావు
సినిమాటోగ్రఫర్ : సతీష్ ముత్యాల
పీఆర్వో : సాయి సతీష్ పాలకుర్తి

టాలీవుడ్‌లో ప్రతీ శుక్రవారం ఎన్నో సినిమాలు విడుదల అవుతుంటాయ్.. ఈ వారం అనగా అక్టోబర్- 18న విడుదలైన లవ్ అండ్ ఎంటర్‌టైన్మెంట్ చిత్రం ‘మళ్లీ మళ్లీ చూశా’. ఇదే రోజు విడుదలైన మిగతా చిత్రాలతో పోలిస్తే ఈ మూవీకి మంచి పాజిటివ్ టాక్ రావడమే కాకుండా.. మొదటి రోజే సినిమా చూడటానికి పెద్ద ఎత్తున జనాలు థియేటర్లకు క్యూ కడుతుండటం దర్శకనిర్మాతలు ఆనందించదగ్గ విషయం. ఈ సినిమాను వీలైనంత వరకూ ఫైరసీని ప్రోత్సహించకుండా థియేటర్లలో చూడడానికి ప్రయత్నించి చిత్రబృందాన్ని ఆదుకోవాల్సిన అవసరం సినీ ప్రియులపై ఎంతైనా ఉంది.

కొత్తవాళ్లైనా అదరగొట్టేశారు!
ఇక సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంలో చాలా పాజిటివ్ బజ్.. హైప్ నిజంగా చాలా బాగుంది. ‘మళ్లీ మళ్లీ చూశా’ సినిమాతోనే హీరో అనురాగ్‌ కొణిదెన.. శ్వేత అవస్తి, కైరవి తక్కర్‌ హీరోయిన్లుగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. తొలి సినిమాతోనే హీరో హీరోయిన్లు మంచి టాక్ సంపాదించుకున్నారు. ఇక మిగిలిన తారాగణం విషయానికొస్తే.. సినిమా మొత్తమ్మీద ఒక నలుగురైదుగురు సీనియర్ నటులు తప్ప మిగిలిన నటీనటీమణులంతా కొత్తవారే అయినప్పటికీ నటన పరంగా అందరూ అదరగొట్టేశారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఈ చిత్రంలో నిర్మాణ పనులు అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే విమర్శకుల నుంచి కూడా మంచి సమీక్షలు అందడమే. అయితే.. సరికొత్త చిత్రంతో కొత్త చిత్రబృందం చేసిన ఈ తొలి ప్రయత్నం ఏ మేరకు వర్కవుట్ అయ్యిందనే విషయం రణరంగం.కామ్ రివ్యూలో చూద్దాం.

కథ :-
గౌతమ్ (అనురాగ్ కొణిదెన) స్వప్న (శ్వేతా అవస్తి) ప్రధాన పాత్రల్లో లవ్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన చిత్రం ‘మళ్లీ మళ్లీ చూశా’. ఈ చిత్రంలో గౌతమ్ ఓ అనాధ.. ఇతను ఆర్మీ మేజర్ (అజయ్) ఇంట్లో పెరుగుతాడు. చిన్నప్పట్నుంచి హీరోకు దేశభక్తి అంటే ఏంటి..? సమాజంలో ఎలా మెలగాలి..? అసలు దేశానికి సేవ చేయడమంటే ఏంటి..? అనే విషయాలన్నీ ఆర్మీ మేజర్ నూరిపోస్తుంటారు. అలా పెరిగి పెద్దయిన గౌతమ్‌‌కు.. డ్యాన్స్, సింగర్ కమ్ రైటర్‌ ఇలా మల్టీ టాలెంటెడ్‌ అని తనకు తానుగా ఫీలయ్యే స్వప్న అనే అమ్మాయి రాసిన ఓ ప్రేమకథ పుస్తకం (డైరీ) దొరుకుతుంది. హైదరాబాద్‌లో ఉండే స్వప్న.. వైజాగ్‌లో టూర్‌కు వెళ్లిన సమయంలో బైరవకొండలో కథ రాసుకోగా.. ఆమె కథ ఆమెకే నచ్చక అక్కడే పుస్తకాన్ని కావాల్సిందే మరిచిపోతుంది. అయితే ఆ పుస్తకం హీరో గౌతమ్‌కు దొరుకుతుంది. ఆ పుస్తకాన్ని ఆ అమ్మాయి అడ్రస్‌కు పంపాలని హీరో ప్రయత్నాలు చేసినప్పటికీ వివరాలు లేకపోవడంతో మిన్నకుండిపోతాడు. ఈ క్రమంలో అసలు పుస్తకంలో ఏముంది..? అని చూడగా.. ప్రేమకథ ఉంటుంది. ఆ కథ చదువుతూ అందులో తనను ఊహించుకుంటూ.. పుస్తకం రాసిన స్వప్న ప్రేమలో పడిపోతాడు. అయితే అమ్మాయికి పుస్తకం ఇచ్చేయాలని వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరతాడు. స్వప్నకు పుస్తకం ఇచ్చాడా.. లేదా? గౌతమ్ ప్రేమను హీరోయిన్ అంగీకరించిందా..? లేదా..? అనేదే ‘మళ్లీ మళ్లీ చూశా’ రొమాంటిక్, లవ్ స్టోరీ.

ప్లస్ పాయింట్స్ :-
– సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పెద్ద ప్లస్.
– పాటలు, లవ్, పంచ్ డైలాగ్స్ బాగున్నాయ్.
– హీరో తొలి ప్రయత్నంతోనే బాగా ఆకట్టుకున్నాడు.. యాక్షన్ సీన్స్‌ చాలా బాగున్నాయ్.. మాస్ రేంజ్‌ హీరోగా ఇరగదీశాడు.
– హీరోయిన్ శ్వేతా అవస్తి ఎక్స్‌ప్రెషెన్స్ బాగున్నాయి. తొలి సినిమాతోనే టాలీవుడ్ సినీ ప్రియులను మెస్మరైజ్ చేసింది.
– సీనియర్ అన్నపూర్ణ (ఉప్మా బామ్మ) తెలంగాణ యాస, డైలాగ్స్..
– తక్కువ నిడివి ఉన్నప్పటికీ మేజర్ పాత్ర ఫిలసాఫికల్ డైలాగ్స్ ఆకట్టుకుంది.
– ఎడిటింగ్ వర్క్ చాలా బాగుంది.
– కామెడీ పెద్దగా లేనప్పటికీ ఉన్న కొద్దిలో బంచిక్ బాబ్జి, చిట్టి బాబు పాత్ర చేసిన జబర్దస్త్ కమెడియన్ నవ్వించే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్ :-
– దర్శకుడు కొన్ని కొన్ని సన్నివేశాలను అనవసరంగా పెట్టారు.
– హీరోయిన్ ఎంట్రీ.. ఆమె కనిపించినప్పుడల్లా వచ్చే సీన్స్ (మేఘాల్లో నుంచి.. నీళ్ల లోనుంచి చేపలు పట్టుకునేదానిలా) ఆకట్టుకోలేదు.
– సినిమాలో డైరీ ప్రకారం కనక్లూజన్ ఇంకా బాగా ఇచ్చుంటే బాగుండేది..
– సినిమా మొత్తమ్మీద క్లైమాక్స్ సీన్ ఎక్కడ ముగించాలో అని కన్ఫూజన్‌లో డైరెక్టర్ ముగించేశారు.
– కొన్ని కొన్ని సన్నివేశాలు అనవసరం పెట్టారు.. దీంతో సినిమా అక్కడక్కడా బోరింగ్ అనిపించింది.. సదరు ప్రేక్షకుడికి నవ్వొచ్చేస్తోంది.

సాంకేతిక విభాగం :-
సంగీత దర్శకుడు శ్రవణ్ భార్గవ్ పాటలు బాగున్నాయ్.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్. మరీ ముఖ్యంగా హీరోయిన్ కనపడినప్పుడల్లా వచ్చే మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ సూపర్బ్. ఎడిటింగ్ కూడా పర్లేదు. ఇక నిర్మాణ విలువల విషయానికొస్తే చిన్న సినిమాకి తగ్గట్టుగానే ఖర్చు చేశారు. సినిమాలో రెండు లవ్ ట్రాక్‌లు చూపించడంతో కాసింత కన్ఫూజన్ ఉంది.

రణరంగం.కామ్ విశ్లేషణ :-
దర్శకుడు హేమంత్ కార్తీక్ తన బుర్రకు ఇంకాస్త పదునుపెట్టి కథను తెరకెక్కించి ఉంటే బాగుండేది. సినిమాలో కొన్ని కొన్ని సీన్లు ప్రేక్షకుడిని బాగా ఇబ్బంది పెట్టాయి.. అంతేకాదు ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు సీట్లో నుంచి బయటికెళ్లాల్సిన పరిస్థితి. ఫస్టాప్ పర్లేదు అనిపించినా సెకండాఫ్‌లో ఏదో చెబుదామనుకొని ఇంకేదే చెప్పాడు డైరెక్టర్. అటు కామెడీ కానీ.. ఇటు రొమాంటిక్ పరంగా కానీ కాస్త సన్నివేశాలను యాడ్ చేసుంటే సినిమాకు కాస్త ప్లస్ అయ్యేదేమో. సినిమా ఇలా ఉంటుందేమో అని ఊహించుకుని వెళ్లిన ప్రేమ జంటలు చాలా వరకు బిస్కట్ అయ్యాయి.. అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి అనే చందంగా లవర్స్ నిరాశ నిస్పృహలతో థియేటర్స్ నుంచి బయటికొస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరోకు కొన్ని కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ అస్సలు సెట్ అవ్వలేదు.. హీరోయిన్ ఎంట్రీ సీన్ అస్సలు బాలేదు.. కొత్తగా ఆలోచించి ఉండాల్సింది. మొత్తమ్మీద చూస్తే పర్లేదు.. లవర్స్, ఫ్యామిలీతో సినిమా చూడొచ్చు.

రణరంగం ట్యాగ్‌లైన్: లవర్స్‌కు ‌కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం
రణరంగం రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here