మిర్యాలగూడ వాసికి అంబేద్కర్ సేవారత్న జాతీయ అవార్డ్..

0
311

అంబేద్కర్ 128 వ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సంయుక్తంగా.. వివిధ రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించి, ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న విశేష వ్యక్తులను గుర్తించి వారికి అంబేద్కర్ సేవారత్న జాతీయ అవార్డ్‌లను అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన డాక్టర్ ఆనంద్ ఈ అవార్డ్ అందుకున్నారు.

డాక్టర్ ఆనంద్ ఇప్పటి వరకు బాలికా విద్య, మానవ హక్కుల పరిరక్షణ ఇతివృత్తంగా కుల వివక్షపై ‘అంటు రానితనం’, మహిళా సాధికారత కథాంశంతో ‘చిరు తేజ్ సింగ్’ లాంటి లఘు చిత్రాలు రూపొందించారు. ఈ చిత్రాలకు జాతీయ స్థాయి అవార్డ్‌లు కూడా లభించడం విశేషం. ఇక ఇటీవలే అమెరికాలో జ్యాత్యహంకార దాడులలో ప్రాణాలను కోల్పోయిన శ్రీనివాస కూచిబొట్ల, శరత్ కొప్పుకి నివాళిగా అనన్య పెనుగొండ అనే నూతన గాయనిని పరిచయం చేస్తూ ‘‘రెయిన్ బో’’ అనే మ్యూజిక్ వీడియో, అదేవిధంగా పాఠశాల, కాలేజీల్లో జరిగే ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా త్రిశూల్ కలాపురంని పరిచయం చేస్తూ ‘‘అమీగ’’ అనే మ్యూజిక్ వీడియో రూపొందించి అశేష ప్రేక్షకాదరణ పొందారు. మరోవైపు డాక్టర్‌గా ‘బంజారా మహిళా యన్‌జీవో’ పేరు మీద మిత్రుల సహాయ సహకారాలతో వందకు పైగా ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహించినందుకు గాను డాక్టర్ ఆనంద్‌కు 2019 అంబేద్కర్ సేవారత్న అవార్డ్ దక్కింది. న్యూ ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ యస్‌సీ కమీషన్ చైర్ పర్సన్ శ్రీమతి నీలం సహాని, రెసిడెంట్ కమీషనర్ శ్రీ ప్రవీణ్ ప్రకాశ్ ఐఏయస్, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.

అవార్డు అందుకున్న అనంతరం డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ఈ అవార్డ్‌ను ఇటీవల కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంగా దారుణ హత్యకు గురైన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌కి అంకితమిస్తున్నట్లుగా తెలిపారు. జాతి, మత, కుల వివక్షలు విడనాడి అంబేద్కర్ కలలు గన్న నిజమైన ప్రంపంచాన్ని నిర్మించేలా ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన కోరారు. తనకు అన్నివిధాలా సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఆనంద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here