రణరంగం రివ్యూ: ఇదంజగత్

0
501

మూవీ పేరు: ఇదంజగత్
విడుదల తేదీ : 28, డిసెంబర్ 2018
నటీనటులు : సుమంత్ , అంజు కురియన్, శివాజీ రాజా, సత్య తదితరులు
దర్శకత్వం : అనిల్ శ్రీకంఠం
నిర్మాత : జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌
సంగీతం : శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫర్ : బాల్ రెడ్డి
ఎడిటర్ : గ్యారీ బిహెచ్

అక్కినేని ఫ్యామిలీ హీరోగా పేరున్న సుమంత్‌కు హీరోగా ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నా కానీ.. స్టార్ ఇమేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోయారు. వైవిధ్యమైన చిత్రాలను చేస్తాడనే పేరు తప్ప.. సరైన బ్లాక్‌బస్టర్ మాత్రం సుమంత్ అకౌంట్‌లో పడలేదనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సుమంత్.. రీసెంట్‌గా వచ్చిన ‘మళ్లీ రావా’ చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్‌ను అందుకోవడమే కాకుండా.. ఆ చిత్రం సుమంత్‌ను బిజీ హీరోని కూడా చేసింది. ఈ మధ్యనే ‘సుబ్రమణ్యపురం’ చిత్రంతో సందడి చేసిన సుమంత్ ఇప్పుడు ‘ఇదం జగత్’ అంటూ ఇయర్ ఎండింగ్ ట్రీట్ ఇవ్వడానికి వచ్చేశాడు. నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అంజు కురియన్ హీరోయిన్. క్రైమ్ బేస్డ్ స్టోరీగా వచ్చిన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్‌ను అందుకుందో రణరంగం రివ్యూలో తెలుసుకుందాం.

కథ: నిరుద్యోగి అయిన నిషిత్ (సుమంత్ ) డబ్బు సంపాదించాలని నైట్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుంటాడు. రాత్రిళ్లు జరిగే సంఘటలను షూట్ చేసి.. ఆ విజువల్స్‌ను టీవీ ఛానెల్‌కు అమ్ముకుని డబ్బు సంపాదిస్తాడు. ఈ క్రమంలో హీరోయిన్ మహతి (అంజు కురియన్) వాళ్ల నాన్న హత్య చేయబడతాడు. ఈ హత్యను సుమంత్ రికార్డు చేస్తాడు. దాన్ని భారీ మొత్తంలో క్యాష్ చేసుకోవాలనుకుంటాడు. మరి సుమంత్ ప్లాన్ వర్కవుట్ అయ్యిందా? ఆ హత్యను ఎవరుచేశారు? ఎందుకు చేశారు? తన తండ్రి హత్యనే క్యాష్ చేసుకోవాలనుకుంటున్న హీరోతో హీరోయిన్ ప్రేమలో ఎలా పడింది? వంటి విషయాలు తెలియాలంటే థియేటర్‌లో చూడాల్సిందే.

ఎవరి నటన ఎలా ఉందంటే.. : నిషిత్ పాత్రలో హీరో సుమంత్ చక్కగా చేశాడు. ఇంకా చెప్పాలంటే ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఎక్కడా వంక పెట్టాల్సిన అవసరమే లేదు. సుమంత్ ఈ జోనర్‌లో మున్ముందు కూడా చిత్రాలు చేయవచ్చు. కొత్త హీరోయిన్ అంజు కురియన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేయకపోయినా.. ఉన్నంతలో పరవాలేదనిపిస్తుంది. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన సత్య కామెడీ బాధ్యతలు స్వీకరించాడు. పోలీస్ పాత్రలకు ప్రాణం పోసే శివాజీరాజా మరోసారి తన పాత్రకు ప్రాణం పెట్టేశాడు. విలన్‌గా ఆదిత్య మీనన్ కరెక్ట్‌గా సరిపోయాడు. మిగతా పాత్రల్లో అందరూ తమ పరిధిమేర నటించారు.

తెరవెనుక నిపుణుల పనితీరు: శ్రీ చరణ్ పాకాల సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చక్కగా ఇచ్చాడు. ప్రేక్షకులను సినిమాలోకి తీసుకెళ్లడంలో అతని పాత్ర చాలా ఉందని చెప్పవచ్చు. అలాగే ఫొటోగ్రఫీ. బాల్ రెడ్డి ఫొటోగ్రఫీ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేస్తూ.. మూడ్‌కు తగిన కలర్స్ వాడాడు. గ్యారీ ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉంటే బాగుండేది. సినిమా గురించి, దాని కుండే ప్రయారిటీ ఏమిటో తెలిసిన నిర్మాతలు కావడంతో.. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. దర్శకుడు అనిల్ శ్రీకంఠం క్రైమ్ జోనర్‌లో డిఫ్రెంట్ పాయింట్‌తో ఈ కథను చెప్పిన తీరు.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్స్‌లో తడబడినా.. ప్రేక్షకులను మాత్రం డిజప్పాయింట్ చేయడు. ముఖ్యంగా ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ ప్రేక్షకులకు మంచి థ్రిల్ నిస్తుంది. మొదటి సినిమా డైరెక్టర్ అని ఎక్కడా అనిపించడు. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాని డీల్ చేశాడు. ఎవరు టచ్ చేయని పాయింట్‌తో కథ రాసుకొని, అంత చక్కగా తెరకెక్కించి మంచి మార్కులు కొట్టేశాడు. ఇంకా చెప్పాలంటే ఇయర్ ఎండింగ్‌కు మంచి థ్రిల్ చేశాడు.

వివరణ: క్రైమ్ రిపోర్ట్ చేసే పాత్రికేయ వృత్తిని దృష్టిలో పెట్టుకుని అనిల్ రాసుకున్న ఈ కథ.. స్ర్కీన్‌ప్లే ఎంతో థ్రిల్లింగా, ఊహించని ట్విస్ట్‌లతో సాగింది. టీఆర్పీ రేటింగ్ కోసం ఛానల్స్ పడే తాపత్రయం, సెన్సేషనల్ న్యూస్ కోసం ఎంత ఖర్చు కైనా వెనకాడని వైనం, వాటికి ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా చక్కగా ఇందులో కుదిరాయి. ప్రేక్షకులు వీటికి బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ప్రస్తుతం ఛానల్స్ తీరు అందరికీ తెలిసిందే కాబట్టి. అలాగే ఈ సినిమాలో నిరుద్యోగులకు కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. ఉద్యోగం లేకపోయినా.. చిన్నపాటి కెమెరా ఉంటే చాలు.. ఫ్రీ లాన్స్ జర్నలిస్టుగా బ్రతికేయవచ్చని చాలా బాగా చూపించారు. ప్రస్తుతం ఇయిర్ ఎండింగ్ హంగామా.. సంక్రాంతి వరకు సరైన సినిమా లేకపోవడం ఈ సినిమాకి కలిసొచ్చే మరో అంశం. ఎటు నుంచి చూసినా ‘ఇదంజగత్’ మాత్రం సేఫ్ ప్రాజెక్ట్. ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయదు.

రణరంగం ట్యాగ్‌లైన్: కొత్తగా ఉంది
రణరంగం రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here