రణరంగం రివ్యూ: ఎన్టీఆర్ కథానాయకుడు

0
755

నిర్మాణ సంస్థ‌లు: ఎన్‌.బి.కె.ఫిలింస్ , వారాహి చ‌ల‌న చిత్రం, విబ్రి
స‌మ‌ర్ప‌ణ‌: సాయికొర్రపాటి, విష్ణు ఇందూరి
తారాగ‌ణం: నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్‌, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గబాటి, సుమంత్, ప్రకాష్ రాజ్, నరేష్ వికె, మురళీ శర్మ, కైకాల సత్యనారాయణ, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యా మీనన్, బ్రహ్మానందం తదితరులు.
సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి
ఛాయాగ్ర‌హ‌ణం: వి.ఎస్‌.జ్జ్ఞానశేఖ‌ర్
కథా స‌హ‌కారం: డా.ఎల్‌.శ్రీనాథ్‌
మాట‌లు: సాయిమాధ‌వ్ బుర్రా
క‌ళ‌: సాహి సురేష్‌
ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: ఎం.ఆర్‌.వి.ప్ర‌సాద్‌
స‌హ నిర్మాత‌లు: విష్ణు ఇందూరి, సాయికొర్ర‌పాటి
నిర్మాత‌లు: న‌ంద‌మూరి వ‌సుంధ‌రా దేవి, నందమూరి బాల‌కృష్ణ‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: జాగ‌ర్ల‌మూడి క్రిష్‌

తెలుగు వారి ఆరాధ్య న‌టుడు నందమూరి తార‌క‌రామారావు.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిన క‌థానాయ‌కుడు. రాజకీయ రంగంలో తెలుగువారి ప్ర‌భంజ‌నాన్ని ఢిల్లీ కోట‌కు చేర‌వేసిన మ‌హానాయ‌కుడు `య‌న్‌.టి.ఆర్‌`. సినీ జీవితంలో త‌న న‌ట‌న‌, క్ర‌మ‌శిక్ష‌ణ ద్వారా న‌టుడిగా, నిర్మాత‌గా, మార్గ‌ద‌ర్శ‌కుడిగా రాణించి ఎంద‌రికో ఆద‌ర్శప్రాయుడిగా నిలిచారు. సినీ రంగం, రాజ‌కీయ రంగం రెండింటిలో త‌నమైన ముద్ర‌ను వేశారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జీవితాన్ని సినిమా రూపంలో తెర‌కెక్కించ‌డం అంటే సాహ‌స‌మే అనాలి. అలాంటి సాహసానికి పూనుకుని ఓ మ‌హానీయుడి చ‌రిత్ర‌ను భావిత‌రాల‌కు అందించాల‌నే త‌ప‌న‌తో ఆయ‌న త‌న‌యుడు నందమూరి బాల‌కృష్ణ చేశారు. అది కూడా రెండు భాగాలుగా ఆయ‌న సినీ ప‌థంలో అంచెలంచెలుగా అధిరోహించి అగ్ర క‌థానాయ‌కుడుగా ఎదిగిన వైనాన్ని `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు` అని.. రాజ‌కీయ ప్ర‌స్థానంలో ఆయ‌న సాధించిన విజ‌యాల ఆధారంగా య‌న్.టి.ఆర్‌.మ‌హానాయ‌కుడు`గా తెర‌కెక్కించారు. ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి అంద‌రిలో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే న‌టించ‌నంత మంది భారీ తారాగ‌ణంతో రూపొందిన ఈ సినిమాకు జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌కుడు. అస‌లు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో సామాన్య జ‌నాల‌కు తెలియ‌ని విష‌యాల‌ను ఏం చూప‌బోతున్నారు? అస‌లు ఆయ‌న‌కు సినిమాల్లో రావాల‌నే కోరిక ఎందుకుపుట్టింది? ఆయ‌న ప్ర‌యాణంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు ఏంటి? ఇలాంటి విష‌యాల‌ను తెలుసుకోవాల‌నే ఆస‌క్తి అంద‌రిలో పెరిగింది. ఇక య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్‌లో తొలి భాగం ‘క‌థానాయ‌కుడు’ విశేషాలు చూద్దాం…

కథ: చెన్నై అడ‌యార్ క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌లో బ‌స‌వ తార‌క‌మ్మ‌(విద్యాబాల‌న్) చికిత్స తీసుకుంటూ ఉంటుంది. ఆమెను క‌ల‌వ‌డానికి అక్క‌డికి ఆమె కొడుకు హ‌రికృష్ణ‌(క‌ల్యాణ్ రామ్‌) వ‌స్తాడు. ఆమె య‌న్‌.టి.ఆర్ ఆల్బ‌మ్ చూడ‌టాన్ని చూపిస్తూ సినిమా స్టార్ట్ చేశారు. అప్పుడు నంద‌మూరి తార‌క రామారావు(బాల‌కృష్ణ‌) రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ప‌నిచేస్తుంటాడు. అక్క‌డ లంచాలు తీసుకుని ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డాన్ని స‌హించ‌లేక మానేసి సినిమాల్లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. మ‌ద్రాస్ చేరుకుని ఎల్‌.వి.ప్ర‌సాద్‌గారిని క‌లుస్తాడు. అక్క‌డి నుంచి ఆయ‌న జీవితంలో సినిమా ఓ భాగంగా ఎలా మారింది. న‌టుడి నుంచి అగ్ర క‌థానాయ‌కుడిగా ఎదిగే క్ర‌మంలో ఆయ‌న ఎదుర్కొన్న స‌వాళ్లు ఏంటి? ఆయ‌న‌కు చేసిన పాత్ర‌లు, ఆయ‌న ప్ర‌యాణం.. ఇత‌రుల‌తో ఆయ‌న మెలిగే తీరు.. సినిమాల‌పై ఆయ‌న‌కున్న క‌మిట్‌మెంట్.. సాధార‌ణంగా ఎన్టీఆర్ సినిమాల గురించి తెలుసు.. రాజ‌కీయంగా కూడా ఆయ‌నేంటో తెలుసు. మ‌రి ఆయ‌న‌కు తెలియ‌ని దాన్ని ఈ సినిమాలో ఏమైనా చూపించారా? అంటే అవ‌న్నీ సినిమాలో చూడాల్సిందే..

ఎవరి నటన ఎలా ఉందంటే.. : ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. పలు రకాల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశాడా అనే రేంజ్‌లో కనిపిస్తాడు. పాతాలభైరవి, గుండమ్మ కథ, రావణబ్రహ్మ, సన్నివేశాల్లో ఇరగదీశాడని చెప్పవచ్చు. కుమారుడు మరణించిన ఎపిసోడ్‌లో బాలయ్య విశ్వరూపం ప్రదర్శించాడు. గుండెలు పిండేసేలా నటనను కనబరిచాడు. సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి సీన్ బాగున్నాయి. ఎమర్జెన్సీ సన్నివేశాలు, పద్మశ్రీ అవార్డు అందుకొన్న సమయంలో కనబరిచిన హావభావాలు ప్రేక్షకుడిని మైమరిపిస్తాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో మేకప్ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి.

ఇక విద్యాబాలన్ తొలిభాగంలో తన ఫెర్మార్మెన్స్‌తో అదరగొట్టింది. ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్టీఆర్ సినీ రంగానికి వెళ్లున్న సన్నివేశాల్లో విద్యాబాలన్ బాగా ఆకట్టుకొంది. అలాగే తన కుమారుడి మరణం ఎపిసోడ్‌, అలాగే యమగోల సినిమాలో జయప్రదతో డ్యాన్సులు వేసే సీన్ల సమయంలో సాదాసీదా మహిళను తలపించేలా నటనను కనబరిచారు. అలాగే చివర్లో రాజకీయాల్లోకి వెళ్తున్న సమయంలో భర్తకు మించిన ఇష్టంగా లేదనే విషయాన్ని తెరమీద చెప్పిన తీరు నిజంగా హ్యాట్సాఫ్. అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపించిన సుమంత్ చక్కటి నటనను ప్రదర్శించాడు. తొలిభాగంలో ఏఎన్నాఆర్, ఎన్టీఆర్ మధ్య బలమైన సీన్లు లేకపోయాయి. తన ఇంటి ఎపిసోడ్‌లో ఎన్టీఆర్‌తో కలిసి చేసిన తమాషా సన్నివేశాల్లో ఏఎన్నాఆర్‌గా సుమంత్ అదరగొట్టాడు. మిగితా పాత్రలు చెప్పుకోవడానికి పెద్దగా స్కోప్ లేని పాత్రలే. ప్రధానంగా ప్రకాశ్ రాజ్, క్రిష్ జాగర్లమూడి, సాయిమాధవ్ బుర్రా, దగ్గుబాటి రాజా తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:
జ్ఞాన శేఖర్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. లైటింగ్, కలర్ ప్యాటర్న్ తదితర అంశాలు బాగున్నాయి. అప్పటి వాతావరణాన్ని తెర మీదకు తీసుకువచ్చిన ఆర్ట్ విభాగం పనితీరు సూపర్ అని చెప్పవచ్చు. రామకృ‌ష్ణ ఎడిటింగ్ క్రిస్పిగా ఉంది.

ప్రొడక్షన్ వ్యాల్యూస్:
ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించిన నిర్మాతలు నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి అని మొదటి నుంచి ప్రచారంలో ఉంది. కానీ సినిమా టైటిల్స్‌లో నందమూరి వసుంధరాదేవి, బాలకృష్ణ పేర్లే కనిపించాయి. అయినా మహనీయుడి జీవితాన్ని ఆవిష్కరించడానికి వారు అనుసరించిన నిర్మాణ విలువలు ప్రతిష్ఠాత్మకమైన రీతిలోనే ఉన్నాయి. నటీనటుల ఎంపికలోనూ, సాంకేతిక నిపుణుల సమకూర్పులోనూ వారి అభిరుచి ప్రేక్షకులను మెప్పించేలా ఉంది.

ప్ల‌స్ పాయింట్స్‌:
– న‌టీన‌టులు
– ద‌ర్శ‌క‌త్వం
– కెమెరా ప‌నిత‌నం
– సంగీతం, నేప‌థ్య సంగీతం
– ఎడిటింగ్‌
– ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు

మైన‌స్ పాయింట్స్‌:
యంగ్ ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ కొన్ని స‌న్నివేశాల్లో సెట్ అయిన‌ట్లు అనిపించ‌లేదు. నిడివి ఎక్కువ‌గా ఉండ‌టం

రణరంగం ట్యాగ్‌లైన్: య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు.. స్పూర్తిదాయకమైన స్టోరీ
రణరంగం రేటింగ్: 4/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here