రణరంగం రివ్యూ: ‘పెళ్లిరోజు’

1
779

చిత్రం: పెళ్ళిరోజు
రిలీజ్ డేట్: డిసెంబర్ 8. 2018
బ్యానర్ : సినీయోగ్ మోషన్ పిక్చర్స్
సమర్పణ: ప్రవీణ్ కందికట్టు
నటీ నటులు : దినేష్, నివేత పేతురాజ్, మియా జార్జ్, రిత్విక, రమేష్ తిలక్ తదితరులు
మాటలు : మల్లూరి వెంకట్
సినిమాటోగ్రఫీ : గోకుల్ బెనోయ్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
సహ నిర్మాత : వినయ్.జె
నిర్మాతలు : మృదుల మంగిశెట్టి, సరస్వతి మంగిశెట్టి
దర్శకత్వం : నెల్సన్ వెంకటేశన్

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో చాలా సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో మెచ్చుకోతగ్గ ది.. యూత్‌ను మెప్పించినది ‘పెళ్లిరోజు’ మాత్రమే. తమిళంలో విజయవంతమైన ‘ఒరు నాల్ కూతు’ చిత్రాన్ని సినీయోగ్ మోషన్ పిక్చర్స్ వారు ‘పెళ్లిరోజు’ పేరుతో తెలుగులోకి అనువదించి కొన్ని మార్పులు చేసి విడుదల చేయడం జరిగింది. నేటి యువతీ యువకుల మనస్తత్వాలకు, భావాలకు అద్దం పడుతున్న సినిమా ఇది. డబ్బింగ్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను మూవీ ఆకట్టుకుంటోంది.

కథ:-
సినిమా మొత్తం ఒక ప్రేమ జంట, మరో ఇద్దరు అమ్మాయిల మధ్యే తిరుగుతుంటుంది. రాజ్(దినేశ్) అనే మధ్య తరగతి కుర్రాడు కావ్య (నివేత పేతురాజ్) ఇద్దరూ ఒకే ఆఫీస్‌‌లో ఉద్యోగం చేస్తూ ప్రేమలో పడతారు. అమ్మాయి ధైర్యంగా తల్లిదండ్రులకు ప్రేమ విషయం చెబుతుంది. ఈ తరుణంలో రాజ్‌‌ను తన తండ్రికి పరిచయం చేయాలని మొదట్లో ఒకట్రెండుసార్లు కావ్య ప్రయత్నాలు చేసినప్పటికీ అసలు అక్కడికెళితే పరిస్థితి ఎలా ఉంటుందనేదాన్ని ముందుగానే ఊహించుకుని రాజ్‌‌ వెళ్లడానికి సాహసించడు. ఆ తర్వాత ఎట్టకేలకు హీరోయిన్ అక్క పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఫంక్షన్‌‌కు పిలిచి రాజ్‌ను తన కుటుంబానికి పరిచయం చేయాలని మరోసారి కావ్య ప్రయత్నిస్తుంది. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుందనేది..? యూత్‌‌ను బాగా అట్రాక్ట్ చేస్తుంది.

ఆర్జే..
ఈ ఒక్క జంటే కాదు.. ఆర్జే సుశీల(రిత్విక) పెళ్లి కోసం నాలుగేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఒక్క సంబంధం కూడా సెట్ అవ్వదు.. ఒక వేళ సెట్ అయ్యినా పెళ్లి పీటల మీది దాకా పోదు. ఇలా జరుగుతున్న క్రమంలో సుశీలకు పెళ్లి సెట్ అవుద్దా..? లేదా..? అనేది చాలా ఇంట్రెస్టింగ్‌‌గా ఉంటుంది.

లక్ష్మీ ఎపిసోడ్..
మరోవైపు .. లక్ష్మీ (మియా జార్జ్) ఈ సినిమాలో చాలా అమాయకురాలిగా, అందంగా కనిపిస్తుంది. ఆమె తోబుట్టువులిద్దరికీ పెళ్లిళ్లు అయిపోతాయి. లక్ష్మీకి మాత్రం మంచి ఉద్యోగం ఉండేవాడికిచ్చి పెళ్లి చేయాలని ఆమె తండ్రి (నాగినీడు) వెతకటం మొదలుపెడతారు. ఇలా సుమారు ఐదారేళ్లు గడిచిపోతాయి. ఆ తర్వాత కుటుంబీకులే తండ్రికి రెబల్స్‌‌గా మారాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత ఏం జరుగుందనేది సినిమాకొచ్చిన జనాలను తథేకంగా స్క్రీన్‌‌కే కట్టిపడేస్తుంది.

ఇలా ఫ్యార్లర్‌‌లో సాగే ముగ్గురి వ్యక్తుల మధ్య సాగే కథలో మధ్యలో జరిగే కొన్ని పరిణామాలు చాలా చక్కగా ఉంటాయి. ఆ బాధల నుంచి వీళ్లు ఎలా గట్టెక్కుతారు..? ప్రేమ జంట ఎలా పేరెంట్స్‌‌ను ఒప్పిస్తుంది..? ఆర్జే సుశీలకు పెళ్లవుతుందా..? మరోవైపు వచ్చిన సంబంధమల్లా వెనక్కి పోతున్న లక్ష్మీ లైఫ్‌‌లోకి మంచి భర్త వస్తాడా..? లేదా అనేది తెలియాలంటే కచ్చితంగా థియేటర్‌‌లో సినిమా చూడాల్సిందే.

నటీనటులు పనితీరు.. సాంకేతికత:-
ఇక హీరో దినేశ్ నటన బాగుంది. నివేత పేతురాజ్ నిజంగానే డైరెక్టర్ నటించమంటే ఈ ముద్దుగుమ్మ మాత్రం పాత్రలో జీవించేసింది. రిత్విక నటన సూపర్బ్.. ఈమె ఎలాంటి పాత్రలో అయినా అవలీలగా ఒదిపోతుంది. మియా జార్జ్ ఎంత అమాయకంగా నటించిందో..! ఇక మధ్య మధ్యలో హీరో ఫ్రెండ్‌‌కు లావుగా ఉన్న కుర్రాడు సినిమా మొత్తానికి హైలైట్ అయ్యాడు. మరోవైపు ఆర్జే రమేశ్ తిలక్ ఇద్దరూ టైమింగ్‌‌ను బట్టి బాగా కామెడీ పండించాడు. నివేత తండ్రి సీరియస్‌‌ పాత్ర బాగుంది. మొత్తానికి చూస్తే చిత్రంలోని పాత్రధారులతా వారివారి పాత్రకు తగిన న్యాయం చేశారని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా చిత్రీకరణ బాగుంది.. కానీ కొన్ని కొన్ని చోట్ల సన్నివేశాలు ఇక్కడెందుకు పెట్టారబ్బా అనే కాసింత చికాకు పుట్టిస్తుంది.

ప్లస్ పాయింట్స్:-
మంచి ఆహ్లాదకరమైన కథాంశం
సన్నివేశాలే ఈ చిత్రానికి ప్రధాన బలం
నివేత పేతురాజ్, రిత్విక నటన బాగుంది
కామెడీ ఉన్నంత సేపు బాగానే పండింది.
‘చిలకా చిలకా..’ పాట సినిమాకు పెద్ద అడ్వాంటేజ్

మైనస్ పాయింట్స్:-
సినిమాలో పెద్దగా ట్విస్ట్‌‌లు లేవు
ప్యార్లర్‌గా కథ సాగడంతో ఎటునుంచి ఎటుపోతుందో అర్థం కాదు
మియా జార్జ్‌‌కు సినిమాలో తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు
సినిమా మొత్తం లేడీ క్యారెక్టర్స్‌‌నే హైలైట్ అయ్యాయి.
ఒకే ఒక్క పాటలో తప్ప మిగిలిన వాటిలో పెద్దగా పసలేదు

రణరంగం విశ్లేషణ:-
డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కథలో అక్కడక్కడా మార్పులు చేర్పులు చేసి చక్కటి కథను డైరెక్టర్ నెల్సన్ వెంకటేశన్ సినీ ప్రియులకు అందించాడు. కొన్ని కొన్ని సీట్లు నిజంగా చాలా అద్భుతంగా వచ్చాయి. మరికొన్ని చోట్ల విజువల్స్ చాలా డల్ అయ్యాయి. సినిమా మొత్తం ప్యార్లల్‌‌గా నడవడంతో ఎక్కడా పెద్దగా బోర్ అనిపించలేదు. తమిళంలో ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్‌గా నిలిపిన జస్టిన్ ప్రభాకరన్ సంగీతం తెలుగులో కూడా శ్రోతలను బాగా ఆకట్టుకుంది. బ్యాక్‌‌గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. సినిమా మొత్తం మీద ‘చిలకా చిలకా..’ పాట సినిమాకొచ్చిన జనాలను అట్రాక్ట్ చేస్తుంది. ఒక డబ్బింగ్ సినిమాని చూస్తున్న సంగతి ప్రేక్షకులకి ఎక్కడా అనిపించకుండా, ఒక తెలుగు సినిమా చూస్తున్న అనుభూతి కలిగేలా చిత్రబృందం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఎలా అయితే చిన్న సినిమాగా విడుదలై తమిళంలో మంచి విజయం సాధించిందో తెలుగులో కూడా అదే స్థాయిలో మంచి విజయం సాధిస్తుంది. కుటుంబసమేతంగా ‘పెళ్లిరోజు’ చూడొచ్చు.

రణరంగం ట్యాగ్‌లైన్: బాగుంది.. ప్రేక్షకులను ‘పెళ్లిరోజు’ ఆకట్టుకుంటుంది.
రణరంగం రేటింగ్: 3.25/5

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here