‘సర్వం తాళమయం’ రివ్యూ…

'sarvam thaalamayam' review

0
463

రిలీజ్ డేట్: మార్చి 08, 2019
నటీనటులు: జి.వి.ప్రకాష్‌, అప‌ర్ణ బాల‌ముర‌ళి త‌దిత‌రులు.
కథ, స్క్రీన్ ప్లే – దర్శకత్వం : రాజీవ్ మీనన్
సంగీతం : ఏఆర్ రహమాన్
సినిమాటోగ్రఫీ : రవియాదవ్
ఎడిటింగ్ : అంతోని
నిర్మాణం : లత మీనన్

సంగీత చిత్రాల్లో కళాతపస్వి కె. విశ్వనాథ్‌ది ప్రత్యేక శైలి. ‘శంకరాభరణం’, ‘స్వాతిముత్యం’, ‘శృతిలయలు’, ‘సాగర సంగమమం’..ఇలా ఏది తీసుకున్నా మన సంప్రదాయ సంగీతాన్ని పెద్దపీట వేస్తూ దాని ఔన్నత్యాన్ని చాటిచెప్పిన సినిమాలే.. వీటి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తాజాగా రాజీవ్‌ మీనన్‌ రూపొందిన చిత్రం ‘సర్వం తాళమయం’ అనే చిత్రం ఆ కోవలోకే వస్తుంది. ఈ చిత్రాన్ని తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా విడుదల చేయడం జరిగింది. తమిళ అభిమానులు, సినీ ప్రియులను మెప్పించిన ఈ సినిమా శుక్రవారం నాడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇందులో నటించిన వారంతా సంగీతం గురించి తెలిసిన గొప్పోళ్లు కావడం విశేషమని చెప్పుకోవచ్చు. కాగా ఇలాంటి వాళ్లంతా ఒకే సినిమాలో నటించడం చాలా అరుదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.

కథ :-
పీటర్‌ (జి.వి. ప్రకాష్‌) అనే కుర్రాడు వెనుకబడిన తరగతికి చెందినవాడు. డప్పులు, ఇతర సంగీత వాయిద్యాలు తయారు చేసే ఒక వెనుకబడిన దళిత సామజిక వర్గానికి చెందిన యువకుడు. తమిళ హీరో అయిన విజయ్ అంటే పడిచచ్చేంత అభిమానం. విజయ్ సినిమా రిలీజ్‌ అయితే చాలు ఈ కుర్రాడు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఇలా అభిమానం మత్తులో స్నేహితులతో కాలాన్ని వృథా చేస్తుంటాడు. పీటర్ తండ్రిది మృదంగాలను తయారు చేసే వృత్తి. కన్నడ సంగీతంలో ఆరితేరిన గురువు, సంగీత విద్వాంసుడు దగ్గర (నెడుముడి వేణు) శిష్యుడిగా చేరతాడు. ఆ తరువాత కొన్ని ఇబ్బందులు ఎదరువుతుంటాయి. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా సంగీతం మీద తన ఇష్టాన్ని మాత్రం పోగొట్టుకోడు.. శిక్షణ ఆపడు.

అపర్ణ అనే ఓ నర్సును పీటర్‌ ప్రేమిస్తాడు. ఆమె చెప్పిన మాటలకు జ్ఞానోదయం అయి జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకుని పైన చెప్పిన విధంగా సంగీతం నేర్చుకోవడానికి వెళ్తాడు. తన గురువు అయిన మృదంగ విద్వాంసుడు వేణు కచేరీకి వెళ్లి ఆ స్థాయికి చేరాలనుకోవాలని కలలు కంటాడు. ఇందుకోసం చాలా అవమానాలు ఎదుర్కొంటూ.. నిరాశతో ఉన్న అతన్ని మళ్లీ అపర్ణ ఇచ్చిన స్ఫూర్తితో లోకమంతా తిరిగి వివిధ సాంప్రదాయాల సంగీతంలో మెళుకువలు నేర్చుకుంటాడు. ఆ తర్వాత తిరిగి వచ్చిన పీటర్‌.. అందరూ మెచ్చే విద్వాంసుడిగా పేరు తెచ్చుకున్నాడా లేదా..? గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడా లేదా..? అనేది థియేటర్లలోకి వెళ్లి తప్పక చూడాల్సిన కథ.

ప్లస్ పాయింట్స్:-
కర్ణాటక సంగీతం గొప్పతనాన్ని అద్భుతంగా చూపించారు.
దళిత వర్గానికి చెందిన వాళ్ళకు ఎదురైన అవమానాలను కళ్లకు కట్టినట్లు చూపించారు.
జి.వి.ప్రకాశ్ నటన అద్భుతం
సంగీత విద్వాంసుడుగా మారుతున్న క్రమంలో పాత్రకు తగ్గట్టుగా మారుతూ అందర్నీ ఆకట్టుకున్నాడు.
హీరోయిన్ సారా అనే న‌ర్సు పాత్రలో అద్భుతంగా నటించింది.. పాత్రకు తగ్గ న్యాయం చేసింది.
లావ్ ట్రాక్‌‌లో హీరోను మోటివేట్ చేసే సీన్‌లో కళ్లార్పకూడా చూసేలా ఉంది.
సీనియర్ నటుడు వినీత్ కూడా చాలా రోజుల తర్వాత మంచి పాత్రలో నటించాడని చెప్పుకోవచ్చు.
సినిమా మొత్తమ్మీద సంగీత విద్వాంసుడుగా నటించిన నెడుముడి వేణు నటన అద్భుతంగా ఉంది.. ఇదే సినిమాకు హైలైట్‌.
మూవీలో నటీనటులంతా వారివారి పాత్రల్లో ఒదిగిపోయి నటించారు.
సినిమాకు సగం ప్రాణం మ్యూజిక్.

మైనస్ పాయింట్:-
సినిమా తెరకెక్కించిన విధానం సూపర్.. కానీ కథాకథనాలు చాలా స్లోగా సాగడం.
హీరో పడిన ఇబ్బందుల ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉంటే బాగుండేది.
కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్‌‌ కంట్యిన్యూ చేసుంటే బాగుండేది.

రణరంగం విశ్లేషణ :-
‘సర్వం తాళమయం’ మూవీలో డైరెక్టర్ ఒకట్రెండు కాదు చాలా అంశాలనే టచ్ చేశాడని చెప్పుకోవచ్చు. గురు శిష్యుల సంబంధాలు, సంగీతంలో పోటీతత్వం, ప్రేమికులలో సహకారం, కులవ్యవస్థ, కర్నాటక సంగీతం ఎలా మార్పు చెందాలి? తదితర అంశాలను దర్శకుడు చాలా చక్కగా తెరకెక్కించాడు. ముఖ్యంగా డైరెక్టర్‌కు సంగీతం బాగా పట్టుఉండటంతో సినిమా బాగా పండిందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చివరిలో వచ్చే ఓ పాటను స్వతహాగా డైరెక్టర్ రచించడం విశేషం.. ప్రత్యేకత. సంగీతానికి చెందిన చిత్రాల్లో దరువులు, తాళాలు, లయలు ఎలా ఉంటాయో సన్నివేశపరంగా మాటలు సేమ్‌ టూ సేమ్ దింపేశారు. ప్రేమికుడ్ని మార్చే క్రమంలో అపర్ణ పలికే సంభాషణలు సూపర్బ్.. లవర్స్‌‌ను స్క్రీన్‌‌వైపే కట్టిపడేశాలా సన్నివేశాలున్నాయి. సంగీతం తెలియాలంటే జ్ఞానం ఉండాలి అన్నట్లుగానే.. మృదంగం తయారీ ఎలా ఉంటుందనే విషయాలను దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. గ్రామాల్లో ఉండే రెండు గ్లాసుల వ్యవస్థను కళ్లకు కట్టినట్లు చూపించాడు.

సినిమా మొత్తమ్మీద బ్రిటీష్‌వాడు నేర్పిన జాతిభేదాన్ని ఇంకా మన ఇండియన్స్ ఇంకా అమలు చేస్తున్నారంటే సినిమా రూపంలో ఒక రకంగా బుద్ధి చెప్పిన డైరెక్టర్ తనదైన శైలిలో సెటైర్ల వర్షం కురిపించాడని చెప్పుకోవచ్చు. మీడియాపై తనకున్న అభిప్రాయమేంటో సినిమాలో చూపించాడు. నేర్చుకోవాలనే పట్టుదల ఉంటే అసలు గురువు దొరక్కపోయినా ప్రకృతినే గురువుగా భావిస్తూ.. కురిసే వర్షం, ఊరిమే మేఘం, పాడే కోయిల, వీచే గాలి. సెలయేటి గలగల.. ఇవన్నీ తాళం. ప్రకృతే తాళం నేర్పిస్తుందని పెద్దలు చెబుతుంటారు.. అది చాలా చక్కగా సినిమాలో చూపించాడు. టాలెంట్ అనేది ఎవరబ్బ సొత్తు కాదన్నది ఎంత నిజమే.. సంగీతమనేది ఏ కొద్దిమందిదో కాదు.. మనసుపెట్టి చేసిన ఎవరికైనా వస్తుందనే పాయింట్‌ను ద్వారా దర్శకుడు నిరూపించాడు. మరీ ముఖ్యంగా మనసుపెడితే అందుకు కులమతాలతో అస్సలు అవసరమే లేదనే భావన చాలా చక్కగా డైరెక్టర్ చూపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సంగీతాన్ని అభిమానించే.. సంగీతం అంటే పడిచచ్చే ప్రతి అభిమానిని ఈ మూవీ థియేటర్లవైపు నడిపిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తికాదు. అలాగని ఓన్లీ సంగీత అభిమానులే కాదు.. ట్రైలర్‌, టీజర్స్ వచ్చినప్పుడే ఈ సినిమా పెద్దలందరి మెప్పు పొందింది. అప్పుడే పరిస్థితి అలా ఉందంటే ఇక సినిమా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

సాంకేతిక వర్గం :-
రాజీవ్ మీనన్ రచయితగా, దర్శకుడిగా ‘సర్వం తాళమయం’ సర్వం అర్పించి పూర్తిగా న్యాయం చేశాడు. కొన్ని చోట్ల కథ స్లోగా నడిచినప్పటికీ.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇరగదీయడంతో లోటుపాట్లేమీ పెద్దగా కనిపించవ్. మాములు సినిమాల్లోనే కెవ్వుకేక అనిపించే రెహమాన్ సంగీత నేపథ్యంలో సినిమా అనే సరికి ఇక చెలరేగిపోయి.. సీన్‌కు తగ్గుట్టుగా మ్యూజిక్‌‌‌ను ఎక్కడికో తీసుకెళ్లాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి గుండె లోతుల్లోకి తీసుకెళ్లారని చెప్పడంలో నో డౌట్. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సినిమాలోని కొన్ని కొన్ని సన్నివేశాలు కళ్ళకు కట్టినట్లు చక్కగా చిత్రీకరించి అందరి మన్ననలు పొందుతున్నాడు. ఎన్నో సినిమాలకు ఎడిటింగ్ తానేంటో నిరూపించుకున్న ఎడిటర్.. ఈ సినిమాతో మరింత పేరు వస్తుంది.. ఇందులో ఎలాంటి సందేహాల్లేవ్.

నిర్మాత గురించి..:-
ఇంత ఖర్చవుతోంది.. అంత ఖర్చు అవుతోందని నిర్మాత ఎక్కడా వెనక్కి తగ్గకలేదు. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారని చెప్పుకోవచ్చు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

రణరంగం తీర్పు:-
ఒక వర్గం ప్రేక్షకులనే టార్గెట్ చేసుకుని తెరకెక్కించినట్లు.. ఎక్కడో లోపముందని తెలుస్తోంది. కథ పరంగా చాలా ఇదివరకు వచ్చిన సినిమాలతో పోలిస్తే ‘సర్వం తాళమయం’ చాలా డిఫరెంట్‌గా ఉంది. అయితే అక్కడకక్కడ కథ కాసింత స్లోగా నడిచింది.. డైరెక్టర్ ఇంకొంత అలెర్టయి ఉంటే ఇంకా బాగుండేది. ఇలాంటి సినిమాలను కచ్చితంగా సంగీత ప్రియులు, సినీ ప్రియులు ఆదరించి బాక్సాపీస్‌కు చేరుస్తారు.. ఇది తథ్యం.

రణరంగం ట్యాగ్‌లైన్: ‘సర్వం తాళమయం’ సింప్లీ సూపర్బ్
రణరంగం. కామ్ రేటింగ్: 4/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here