తెలంగాణ ఉద్యోగులు చేపట్టిన ఉద్యమం ముగియక ముందే ఏపీ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టబోతున్నారు. సమస్యలు పేరుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యమం ద్వారా తమ డిమాండ్లను పరిష్కరించుకోవాలని ఉద్యోగులు భావిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం సర్వశిక్ష అభియాన్ సమావేశ భవనంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో దీనిపై తీర్మానం చేశారు. అధికారులను కలిశామని.. మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చామని అయినా ప్రభుత్వంలో చలనం లేదని వాపోయారు.
సమస్యల పరిష్కారానికి ఉద్యమం ఒక్కటే మార్గమని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి(ఏపీజేఏసీ) ఈ నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. సెప్టెంబరు 30తో పీఆర్సీ గడువు ముగిసినప్పటికీ… ప్రభుత్వం నవంబరు 30 వరకు ఈ గడువును పొడిగించింది. ఇకపై పొడిగించకుండా వెంటనే కొత్త స్కేల్స్ అమలు చేయాలని డిమాండ్ చేయనున్నారు. తమకు 11వ పీఆర్సీలో 55 శాతం ఫిట్మెంట్తో కొత్త స్కేల్స్ అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. 1-7-2018 నుంచి పీఆర్సీ అమలు చేయాలని… ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (జేఏసీ) సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.