మా అమ్మ 9 నెలల గర్భిణీ అయ్యుండి ANR సినిమా చూసింది.. మెగాస్టార్ చిరంజీవి

0
595

అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ప్రతిష్ఠాత్మకంగా అందజేసే ఏఎన్నార్‌ జాతీయ పురస్కార ప్రదానోత్సవం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. 2018కి దివంగత నటి శ్రీదేవికి, 2019కి ఈ అవార్డు నటి రేఖకు ఈ పురస్కారం దక్కింది. ప్రముఖ నటుడు చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అవార్డులను అందించారు. శ్రీదేవి తరఫున బోనీ కపూర్‌ పురస్కారం అందుకున్నారు.

ANR నేషనల్ అవార్డు ప్రధాన మహోత్సవం సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘ఇదొక 60 వ దశాబ్దం కిందటి కథ.. ఏంటంటే ఒక పెళ్లైన జంట ఆమె 9 నెలల నిండు గర్భిణీ. ఆ సమయంలో తనకు ఇష్టమైన హీరో సినిమా విడుదలైంది. సినిమా చూడాలంటే వాళ్లుండేది ఒక పల్లెటూరిలో కనుక 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క టౌన్ కి వెళ్లి చూడాలి. డెలివరీ అయ్యాక మళ్లీ ఆ సినిమా చూడలేనని అప్పుడే తీస్కెళ్లమని తన భర్తని కోరింది.

గర్భిణిగా తన కోరిక కదా అని అతను ఆమెను జట్కా బండి మీద తీసుకెళ్లాడు. అప్పట్లో కార్ వంటి వాహనాలేమీలేవు. వాళ్ళు వెళ్తుండగా మధ్యలో బండి గతుకుల రోడ్డు కనుక పడిపోయింది. భర్త కంగారుపడి ఏమైందని అడిగితే ఆమె చిన్న దెబ్బలే తగిలాయి ఏం కాలేదు అని చెప్పి తమాయించుకుంది. భర్త సినిమా వొద్దు ఇంటికెళ్దాం అంటే, లేదు సినిమా చూడాలని పట్టు బట్టిందామె. చివరికి టౌన్ కి వెళ్లి సినిమా చూసి వచ్చారు. ఆమె ఎంతో ఆనందపడింది.

ఇందులో ఆ నిండు గర్భిణీ మా అమ్మ అంజనాదేవి, ఆయన మా నాన్న వెంకట్రావు గారు. అది 1955 వ సంవత్సరం. ఆ పల్లెటూరు మొగల్తూరు. ఆ టౌన్ నర్సాపురం. ఆ సినిమా పేరు ‘రోజులు మారాయి’. ఆ కథానాయకుడు ఎవరో కాదు మన అక్కినేని నాగేశ్వరావు గారే. అప్పుడు ఆమె కడుపులో ఉన్నది నేనే.’ అని చెప్పడంతో హాల్ అంతా చప్పట్లతో మార్మోగిపోయింది. తర్వాత చిరంజీవి ANR గురించి పొగుడుతూ ‘ఆయనొక నడిచే నిఘంటువు అంటే ఎన్సైక్లోపీడియా లాంటి వారు’ అంటూ మాట్లాడారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here