ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. రేపే విధుల్లో చేరండి

0
192

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ గుడ్ న్యూస్ చెప్పారు. రేపు ఉదయం అందరూ విధుల్లో చేరాలని చెప్పారు. విధుల్లో చేరేందుకు ఎలాంటి షరతుల్లేవని అన్నారు. ఆర్టీసీ సమస్యపై మంత్రివర్గం సమావేశం ముగిసిన తర్వాత ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేబినెట్‌ నిర్ణయాలను సీఎం వెల్లడించారు.

“యూనియన్‌ నాయకుల మాట విని ఆర్టీసీ కార్మికులు నష్టపోయారు. ఏ ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేయలేదు. ఆర్టీసీ కార్మికులను తప్పుదోవ పట్టించారు. కార్మికుల సమ్మె చట్టవిరుద్ధం. లేబర్‌ కోర్టుకు వెళ్లమని హైకోర్టు తెలిపింది. లేబర్‌ కోర్టుకు వెళ్లేందుకు మాకు ఇంకా సమయం ఉంది. ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీలు లోక్‌సభలో నూతన రవాణా చట్టానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇది ప్రజలు తెలుసుకోవాలి.

ఆర్టీసీకి కేంద్రం దాదాపు రూ.21వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికైనా కార్మికులు నిజానిజాలు తెలుసుకోవాలి. కార్మికులంతా రేపు ఉదయానికల్లా విధుల్లో చేరండి. ఎలాంటి షరతులు పెట్టం. దీనిపై కాసేపట్లో ఉత్తర్వులు కూడా జారీ చేస్తాం. తాత్కాలికంగా ఆర్టీసీకి రూ.100 కోట్లు మంజూరు చేస్తాం. కిలోమీటరుకు 20పైసలు చార్జీలు పెంచితే ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయం అదనంగా వస్తుంది. వచ్చే సోమవారం నుంచి ఇది అమలులోకి వస్తుంది. ఆర్టీసీ ప్రైవేటీకరణ నిజం కాదు. అవన్నీ ప్రతి పక్షాలు చేసిన దుష్ప్రచారం.

ఆర్టీసీ సమ్మె కారణంగా చనిపోయిన కార్మికుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటాం. యూనియన్ల మాయలో పడి కార్మికులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు. కార్మికులను కాదని మేము ఎటువంటి నిర్ణయం తీసుకోము. తాత్కాలిక ఉద్యోగుల విషయంలోనూ సానుభూతితో వ్యవహరిస్తాం’’ అని కేసీఆర్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here