ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ వరాల జల్లు

0
124

ఆర్టీసీ కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. వారిని ఇక నుంచి ఆర్టీసీ కార్మికులు అనొద్దని.. ఉద్యోగులుగా పిలవాలని నిర్దేశించారు. సమ్మె కాలం మొత్తానికి వేతనం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం ప్రగతి భవన్‌లో కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు.

ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 60 ఏళ్లకు పెంచారు. ఏటా బడ్జెట్‌లో ఆర్టీసీ రూ.1000 కోట్లు కేటాయిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఒక్క ప్రైవేటు బస్సుకూ అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. సమ్మె కాలానికి వేతనం ఏకమొత్తంగా, సెప్టెంబరు వేతనం నేడు చెల్లిస్తానని కేసీఆర్ వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులకు గృహ నిర్మాణ పథకంతో పాటు వారి పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా ఇస్తామని వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు బస్‌పాస్‌, వైద్యం అందిస్తామన్నారు.

తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామని ప్రకటించారు. పీఎఫ్‌, సీసీఎస్‌ బకాయిలను చెల్లిస్తామన్నారు. రెండేళ్లపాటు యూనియన్‌ ఎన్నికలను రద్దు చేస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు.. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. అంతే కాకుండా మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా వరాలు ప్రకటించారు. మహిళా ఉద్యోగులకు నైట్‌ డ్యూటీలు ఇకపై ఉండవన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు చైల్డ్‌ కేర్‌ లీవ్‌‌ను కూడా కేసీఆర్ అనౌన్స్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here