టీఆర్ఎస్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సీపీఐ

0
79

టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతిస్తూ మరోవైపు హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వడంపై రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు ప్రకటించిన మద్దతును వెనక్కి తీసుకోవాలని సోమవారం జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ భేటీలో నిర్ణయించారు. ప్రస్తుతం సీపీఐతో పొత్తు కారణంగా హుజూర్‌నగర్‌లో తమకు గెలుపు అవకాశంపై టీఆర్ఎస్ ధీమాతో ఉంది.

ఆర్టీసీ సమ్మెతో తలెత్తిన వ్యతిరేకతను సీపీఐ మద్దతుతో తిప్పి కొట్టాలని టీఆర్ఎస్ చూస్తోంది. ఈ నేపథ్యంలో సీపీఐ పొత్తుకు నిరాకరించడంతో ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో టీఆర్ఎస్ పడిపోయింది. కార్మిక విభాగం సీపీఐపై ఒత్తిడి పెంచడంతో సోమవారం సీపీఐ కీలక నేతలంతా భేటీ అయి మద్దతు ఉపసంహరణ నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల పట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె చేయడమనే కార్మికుల చట్టబద్దమైన హక్కు అని.. దాన్ని నిరాకరించడం కార్మిక వ్యతిరేక వైఖరేనని చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు చూడటమే కాకుండా.. కొత్త నియామకాల ద్వారా నిరుద్యోగులు, కార్మికులకు మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తోందన్నారు. అధికార టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలకు చాడ విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here