ఉద్యోగం విషయంలో ఆందోళన.. మహిళా కండక్టర్ ఆత్మహత్య

0
31

ఆర్టీసీ కార్మికుల జీవితాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందోనన్న ఆందోళనలో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. సోమవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఆర్టీసీ మహిళ కండక్టర్ నీరజ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సత్తుపల్లిలో విధులు నిర్వహిస్తున్న నీరజ ఖమ్మంలోని కవిరాజ్‌నగర్‌లో తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రోజూ సత్తుపల్లి వెళ్లి ఆందోళనలో పాల్గొంటున్న కండక్టర్‌ నీరజ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఖమ్మం రూరల్‌ మండలం పల్లెగూడేనికి చెందిన ఆమె ఐదేళ్లుగా కండక్టర్‌గా పనిచేస్తున్నారు. మేనమామ కుమారుడు భీమిలి రాజశేఖర్‌తో వివాహం కాగా.. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త రాజశేఖర్‌ ముదిగొండలోని ఓ గ్రానైట్‌ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. నీరజ బలవన్మరణంతో ఆమె కుటుంబంతో పాటు ఆర్టీసీ కార్మికుల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది.

నీరజ ఆత్మహత్య వార్త తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు.. ఆమె మృతదేహాన్ని ప్రదర్శనగా ఖమ్మం కలెక్టరేట్‌ వద్దకు తీసుకెళ్లారు. మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం 4.30గంటల వరకు ధర్నా నిర్వహించారు. నీరజ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం, డబుల్‌బెడ్‌ రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జేఏసీ నాయకులతో చర్చల అనంతరం.. రూ.7.50లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం, మూడెకరాల భూమి, ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య అందించేలా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here