47 రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె చరమాంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో సమ్మె ముగియబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికోసం మంత్రి హరీశ్ రావు స్వయంగా రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఆర్టీసీ జేఏసీ నేతలతో మాట్లాడిన అనంతరం దీనికి ఫుల్స్టాప్ పెడతారని సమాచారం. ఇప్పటికే సమ్మెపై ఏమాత్రం ప్రభుత్వం స్పందించకపోవడం.. మరోవైపు తమ ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందోనన్న ఆందోళనతో కార్మికుల ఆత్మహత్యల నడుమ జేఏసీ నేతలు సైతం తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
తామేమీ చేయలేమని హైకోర్టు తీర్పును వెలువరించడంతో వారి పరిస్థితి మరింత అగమ్య గోచరంగా మారింది. మరోవైపు తమను చర్చలకు ఆహ్వానించాలని ఆర్టీసీ కార్మికులు కోరినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో దిక్కు తోచని స్థితిలో ఉన్న కార్మికులకు.. ప్రభుత్వానికి వారధిలా హరీశ్‌రావు రంగంలోకి దిగారని సమాచారం. దీంతో మరికొన్ని గంటల్లో సమ్మెకు ఫుల్స్టాప్ పడినట్టేనని తెలుస్తోంది.