ఆర్టీసీ ప్రైవేటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

0
207

హైదరాబాద్: ఆర్టీసీ ప్రైవేటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వాలంటూ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. చట్ట నిబంధనలు పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.

మోటారు వాహనాల చట్టం-1988లోని సెక్షన్‌ 102 ప్రకారం ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకుని ఏదేని నిర్ణయం తీసుకునే విశేషాధికారాలు ప్రభుత్వానికి ఉంటాయని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం.. ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వాలంటే చట్ట సవరణకు సంబంధించి తొలుత గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలన్నారు. దానిపై అభ్యంతరాలు స్వీకరించేందుకు స్థానిక పత్రికల్లో 30 రోజులు గడువు ఇస్తూ ప్రకటన ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రజల నుంచి, ఆర్టీసీ నుంచి అభ్యంతరాలు స్వీకరించడంతో పాటు ఈ నిర్ణయం కారణంగా నష్టపోయే ఆర్టీసీ అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం నిర్దేశించింది. రోడ్డు భద్రత పాటించాలని… అధిక రద్దీని నివారించాలని తెలిపింది. ప్రజల అంచనాలకు తగినట్లు ప్రజా రవాణా ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ నేపత్యంలో 5,100 ప్రైవేటు బస్సులకు పర్మిట్లపై పిటిషన్‌‌ను హైకోర్టు కొట్టి వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here