ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు ఫైర్

1
262

ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము కార్మికులతో చర్చలు జరపాలని అక్టోబరు 18నే ఆదేశాలు ఇస్తే ఎందుకు జాప్యం చేశారని ప్రశ్నించింది. కార్మిక నాయకులతో ఏం చర్చించాలో ముందే నిర్ణయించుకుని వస్తే ప్రయోజనముంటుందా? అని ప్రశ్నించింది. ఒక కేసులో తాము శిక్ష వేయాలని నిర్ణయించుకుని కోర్టుకు వస్తే ప్రయోజనముంటుందా? అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఈడీల కమిటీ నివేదికను సమర్పించకపోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ వద్ద కూడా నివేదికలను దాచిపెడతారా? అని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్మికుల కోర్కెల్లో చాలా వరకూ తీర్చదగ్గవే ఉన్నాయని… సుమారు 47-50 కోట్లు ఇస్తే నాలుగు ప్రధాన డిమాండ్లు పరిష్కారమవుతాయని పేర్కొంది. కార్మికుల తక్షణ డిమాండ్ల పరిష్కారానికి రూ.47 కోట్లు ఇచ్చే స్థితిలో రాష్ట్రం లేదా? దివాలా తీసిందా? అని ప్రశ్నించింది.

దీనికి ఏజీ రామచంద్రరావు.. ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని, కార్మికుల కోరికలు మరీ దారుణంగా ఉన్నాయన్నారు. 2015లో 44 శాతం ఫిట్‌మెంట్‌, 2018లో 16 శాతం ఐఆర్‌ ఇచ్చామని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఆర్టీసీ అంత కష్టాల్లో ఉంటే 44 శాతం ఫిట్‌మెంట్‌ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. 22 శాతం కంటే ఎక్కువ ఇవ్వలేమని అప్పుడే ఎందుకు చెప్పలేదని నిలదీసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం ప్రభుత్వం, ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని మండిపడింది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here