TSRTC: ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వ వైఖరిపై హైకోర్టు సీరియస్

0
46

ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరు పక్షాలు సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని సూచించింది. తక్షణమే ఆర్టీసీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌ను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. బడులకు సెలవులను పొడిగించడంపై కూడా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రభుత్వ తరపు న్యాయవాది 70 శాతం బస్సులను నడిపిస్తున్నామని చెప్పడంతో మిగిలిన 30 శాతం బస్సుల మాటేంటని ప్రశ్నించింది. డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి పత్రికా ప్రకటన ఇచ్చామని, లైసెన్సులు పరిశీలించి నియామకాలు చేపడుతున్నామని ఏజీ చెప్పడంపై హైకోర్టు ధర్మాసనం ప్రశ్నల జల్లు కురిపించింది.

గడచిన 10 రోజుల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఎంతమంది డ్రైవర్లు, కండక్టర్లు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు? వారిలో ఎందరిని నియమించారని ప్రశ్నించింది. లోకాయుక్తను నియమించకపోవడంతో పాటు ఆర్టీఐ కమిషనర్లు, బాలల సంరక్షణ కమిటీలను వేయక పోవడం, మానవ హక్కుల కమిషన్‌ను నియమించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మె పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో బుధవారంలోగా చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది.

సమ్మె విరమించాలని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీని.. గుర్తింపు పొందిన ట్రేడ్‌యూనియన్లను ఆదేశించాలని కోరుతూ ఉస్మానియా వర్సిటీ విద్యార్థి ఆర్‌. సురేందర్‌సింగ్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌ మంగళవారం విచారణకు వచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here