హరీష్‌ను తన ధృతరాష్ట్ర కౌగిలిలో బంధించిన కేసీఆర్.. పెద్ద కుట్రే ఉందిగా!

7
457

తెలంగాణలో ఆదివారం నాటికి పూర్తి స్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. సీఎం కేసీఆర్ తన కేబినెట్‌ను విస్తరించారు. ఖాళీగా ఉన్న ఆరు పదవులను ఆయన భర్తీ చేయడంతో ఆదివారం రాజ్‌భవన్‌లో ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్‌ కేబినెట్‌లోకి హరీశ్‌ రావు (సిద్దిపేట), కేటీఆర్‌ (సిరిసిల్ల), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), గంగుల కమలాకర్‌ (కరీంనగర్‌), సత్యవతి రాథోడ్‌ (ఎమ్మెల్సీ), పువ్వాడ అజయ్‌ కుమార్‌ (ఖమ్మం)లను తీసుకున్నారు. వీరిలో హరీశ్‌రావుకు ఆర్థిక శాఖ, కేటీఆర్‌కు ఐటీ, పరిశ్రమలు, సబితకు విద్య.. జగదీశ్‌రెడ్డికి విద్యుత్, సత్యవతికి ఎస్టీ, మహిళా సంక్షేమ శాఖ, గంగులకు బీసీ సంక్షేమం, పౌరసరఫరాలు, పువ్వాడ అజయ్‌కి రవాణా బాధ్యతలు అప్పగించారు.

జననేతను.. ఆ జనం నుంచి దూరం చేసేందుకేనా?
అంతా బాగానే ఉంది అనిపిస్తున్నా.. హరీష్‌రావును మంత్రివర్గంలోకి తీసుకోవడం వెనుక లోగుట్టు మరొకటి ఉందంటూ ప్రచారం జరుగుతోంది. హరీష్‌రావుకు జననేతగా మంచి పేరుంది. ఇంతకాలం ఆయనకు మంత్రి పదవి కేటాయించకపోవడంతో ఆయన మనసులో మాటెలా ఉన్నా.. ఆయనను అమితంగా ప్రేమించే ప్రజలు మాత్రం చాలా ఆవేదన చెందారు. ఇన్నాళ్లకు ప్రజాభీష్టం మేరకు హరీష్‌కు మంత్రి పదవి దక్కింది. అయితే ఇది జననేతను ఆ జనాల నుంచి దూరం చేసే యోచనలో భాగమేనన్న ప్రచారం జరుగుతోంది. హరీష్‌కు ఆర్థికశాఖను కేటాయించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జనాలతో సంబంధాలు లేకుండా చేసేందుకు కేసీఆర్ వేసిన మాస్టర్ ప్లాన్ అని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

హరీష్‌ను కేసీఆర్ తన ధృతరాష్ట్ర కౌగిలిలో బంధించారా!
గతంలో కేటీఆర్‌కి ఐటీ, పరిశ్రమలు శాఖను కేటాయించిన కేసీఆర్, ఇప్పుడు కూడా అదే శాఖను ఆయనకు కేటాయించారు. కానీ హరీష్ విషయంలో మాత్రం శాఖ మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వెనుక హరీష్ కృషి మాటల్లో చెప్పలేనిదనేది జగమెరిగిన సత్యం. కానీ దాని ప్రారంభోత్సవానికి కేసీఆర్ ఆయనను ఆ దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. ప్రజలతో మమేకమవుతూ నిర్వహించిన ఆ శాఖను కేసీఆర్ తిరిగి ఆయనకు కేటాయించలేదు. హరీష్ పార్టీ మారుతారన్న వార్తలు ఒకవైపు.. ఆయనకు మంత్రి పదవి కేటాయించకపోవడం పట్ల సొంత పార్టీ కేడర్ నుంచి తలెత్తుతున్న వ్యతిరేకతల నడుమ కేసీఆర్ తన మాస్టర్ మైండ్‌తో హరీష్‌కు చెక్ పెట్టారని ప్రచారం జరుగుతోంది. సామాన్య ప్రజానీకానికి హరీష్‌కు మంత్రి పదవి కేటాయించారన్న విషయం మాత్రమే తెలుస్తోంది కానీ అసలు విషయం తెలియట్లేదు. ప్రజలకు ఏమాత్రం దగ్గర కాలేని.. ఒక రకంగా చెప్పాలంటే దూరం చేసే శాఖను కేటాయించి కేసీఆర్ తన ధృతరాష్ట్ర కౌగిలిలో హరీష్‌ను బంధించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

పేరుకే కీలక శాఖ.. పెత్తనం కేసీఆర్‌దే!
హరీష్‌కి కేటాయించింది ఆర్థికశాఖ. అత్యంత కీలక శాఖ కానీ ఏం లాభం ‘సొమ్మొకడిది.. సోకొకడిది’ అన్న చందంగా కీలక శాఖను హరీష్ చేతుల్లో పెట్టి… పెత్తనం మొత్తం తన చేతుల్లో ఉంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సిన హరీష్‌ను కేవలం మండలికి పరిమితం చేసి.. కేసీఆరే అన్నీ తానై బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. దీంతో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు. మొత్తంగా చూస్తే ఒక కీలకశాఖను హరీష్ చేతుల్లో పెట్టి.. జనాలకు దూరంగా ఉంచే ప్రయత్నం జరుగుతోందని.. మరోవైపు పార్టీ మారే ఆలోచన చేయకుండా హరీష్‌కు కేసీఆర్ సమర్థంగా చెక్ పెట్టారని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చూస్తే హరీష్‌కు మంత్రి పదవి ఇవ్వడం వెనుక పెద్ద కుట్రే జరిగిందిగా!

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here