మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ

0
204

రేపు (6 అక్టోబర్) ఉదయం గం. 10.15 నిమిషాలకు తాడేపల్లిగూడెం, ఎస్.వి.ఆర్ సర్కిల్, కె.యెన్ రోడ్ లో విశ్వ నట చక్రవర్తి కీ.శే ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. స్వాతంత్ర్య సమార యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డిగా అద్భుతంగా నటించిన చిరంజీవి ‘సైరా’ మూవీ వంటి ఒక గొప్ప చారిత్రక విజయాన్ని అందుకున్న సందర్బంగా ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ చేయడం ఎంతో సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.

ఎస్వీఆర్ పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. విశ్వ నట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ ఈయనకున్న బిరుదులు. ఆయన 3 జులై 1918 నూజివీడులో జన్మించారు. తర్వాత మద్రాస్, ఏలూరు, విశాఖ పట్నం లలో చదువుకుంటూనే నాటకాల్లో నటించేవారు. మొదట షేక్స్ పియర్ డ్రామాల్లో నటించిన ఆయన తర్వాత సినీ రంగంలో ప్రవేశించారు. ఆయన దాదాపు 30 ఏళ్లలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ అన్ని భాషల్లో 300 లకు పైగా చిత్రాల్లో నటించారు.

ఆయన రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు మరియు ‘బాల నాగమ్మ’ చిత్రంలో మాంత్రికుడిగా పౌరాణిక చిత్రాల్లో ప్రతినాయక పాత్రలు పోషించి గొప్ప నటుడిగా పేరు పొందారు. అంతేకాకుండా పాతాళ భైరవి, మాయా బజార్, నర్తనశాల చిత్రాలలో ప్రముఖ పాత్రలు పోషించారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘యశోద కృష్ణ'(1975).

నర్తనశాల చిత్రంలో ఆయన నటనకు ‘భారత రాష్ట్రపతి’ పురస్కారం మరియు ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నారు. ఆయన సినీ నటుడిగానే కాక దర్శకరచయితగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన రెండవ చిత్రం ‘బాంధవ్యాలు’ ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం అందుకుంది. 18 జులై 1974 లో ఆయన 56 ఏళ్ల వయసులో మద్రాస్ లో గుండెపోటుతో మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here