‘బిగ్ బాస్ విన్నర్’పై నాగార్జున ట్వీట్.. షాక్‌లో నెటిజన్లు

0
70

పదిహేను వారాలుగా దిగ్విజయంగా సాగుతోంది బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ -3. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుందీ షో. ఇక, తాజాగా జరుగుతున్న ‘బిగ్ బాస్’ మూడో సీజన్‌కు కూడా అదే స్థాయిలో స్పందన వచ్చింది. గత సీజన్లతో పోలిస్తే ఇందులో లవ్, ఎమోషన్స్, రొమాన్స్, వార్స్ ఎక్కువగా కనిపించడంతో ప్రేక్షకుల నుంచి ఆదరణను దక్కించుకోగలిగింది. దీనికి తోడు నాగార్జున హోస్టింగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందనే చెప్పాలి. అందుకే గత సీజన్ల కంటే దీనికి ఎక్కువ రేటింగ్స్ వచ్చిన విషయం కూడా తెలిసిందే.

లీకుల భయంతో గత సీజన్ల కంటే భిన్నంగా ఇందులో ఓటింగ్ సిస్టమ్‌లో మార్పులు చేశారు. అలాగే ఎన్నో జాగ్రత్తలు సైతం తీసుకున్నారు. కానీ, ఇప్పటి వరకు ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయం ఎలాగోలా బయటకు వచ్చేసేది. ఇక, ఫైనల్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని బిగ్ బాస్ నిర్వహకులు భావిస్తున్నారు. ప్రతి విషయాన్ని ఎంతో రహస్యంగా ఉంచాలని చూస్తున్నారు.

మరోవైపు, సోషల్ మీడియాలో మాత్రం విజేత ఎవరన్న దానిపై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఫైనల్‌కు చేరుకున్న ఐదుగురు కంటెస్టెంట్లు శ్రీముఖి, వరుణ్ సందేశ్, రాహుల్ సింప్లీగంజ్, బాబా భాస్కర్, అలీ రెజాలలో ఎవరు బిగ్ బాస్ టైటిల్‌ను ముద్దాడుతారన్న విషయంపై కొద్ది రోజులుగా ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో రాహుల్ సింప్లీగంజ్ గెలిచాడని చాలా సంస్థలు పేర్కొంటున్నాయి. అలాగే, ప్రముఖ యాంకర్ శ్రీముఖి విజయం సాధించిందని కూడా వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో షో హోస్ట్ అక్కినేని నాగార్జున కీలక ప్రకటన చేశారు. ‘‘బిగ్‌బాస్-3’ ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ కొద్ది గంటల్లో జరుగబోతుంది. నాకిది చాలా అద్భుతమైన ప్రయాణం. ఫైనల్ ఎపిసోడ్ లైవ్‌లో ప్రసారం కాబోతోంది. సోషల్ మీడియాలో విజేత గురించి వస్తున్న వార్తలను నమ్మకండి. సాయంత్రం జరిగే లైవ్ ప్రోగ్రాంలో విజేత ఎవరనేది తెలుసుకోండి’’ అని ఆయన పేర్కొన్నారు. నాగ్ ప్రకటనతో ఇప్పటి వరకు వచ్చిన వార్తలు ఫేక్ అని తేలడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here