హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీరును పాకిస్థాన్‌లో భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. పాక్‌లోని బహావల్పూర్ వద్ద కొలిస్థాన్ ఎడారిలో సోమవారం ప్రశాంత్, అతనితో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన టెకీ దరీలాల్ అనే వ్యక్తిని పాక్ భద్రతా బలగాలు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే పాక్ మీడియాలో ప్రసారమవుతున్న ప్రశాంత్ తెలుగు వీడియోలో తన తల్లిదండ్రులకు ఓ సందేశమిచ్చాడు.
‘‘మమ్మి.. డాడీ.. బాగున్నారా? ఇక్కడ అంతా బాగుంది. ఇప్పు డు నన్ను పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తెచ్చారు. ఇక్కడి నుంచి జైలుకు పంపిస్తారు. జైలు నుంచి భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందిస్తారు. అప్పుడు మీతో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఇంకో నెల రోజుల్లో విడుదల కావొచ్చు. ఖైదీల పరస్పర మార్పిడిలో భాగంగా నన్ను భారత్‌కు పంపుతారు.’’ అని ప్రశాంత్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. అయితే.. ఆ వీడియో ఇప్పటిది కాదని.. రెండేళ్ల కిందటిదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలపడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే ప్రశాంత్‌ను ఎప్పుడు అరెస్ట్ చేశారనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది.