ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ఎవ్వరికీ తెలియని షాకింగ్ నిజాలు.. అసలు కథ ఇదే.

0
413

మరికొద్ది రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. దీంతో సినిమాపై ఆసక్తి విపరీతంగా పెరిగింది. ఈ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడి జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ఈ రోజుల్లో తెలిసింది అతి కొద్ది మందికి మాత్రమేనని చెప్పాలి.
ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఆయన కథను ‘రణరంగం’ ‘వశిష్ట మీడియాతో కలిసి అందిస్తోంది.

నరసింహారెడ్డి కుటుంబ నేపథ్యం…
1857 నుంచి జరిగిన స్వాతంత్ర్య సంగ్రామం గురించి మాత్రమే మనకు బాగా తెలుసు. అంతకు 10 ఏళ్ల క్రితమే బ్రిటీష్ వారిపై కత్తి దూసిన వీరుడు రాయలసీమకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో ఆయన బ్రిటీష్ వారిపై తన పోరాటానికి తెరదీశారు. అయితే ఆయన పోరాటం ఏడాది లోపే ముగిసి పోవడంతో పెద్దగా వెలుగులోకి రాలేదు. నరసింహారెడ్డి కర్నూలు జిల్లా రూపనగుడి గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిపేరు నీలమ్మ. నొస్సం జమీందారి చిన్న కూతురు. నరసింహారెడ్డి తండ్రి పెద మల్లారెడ్డికి నీలమ్మ రెండో భార్య. మొదటి భార్య పేరు సిద్ధమ్మ. నిజాం ఆధీనంలో ఉన్న రాయలసీమను నిజాం నవాబు బ్రిటీష్ వారి ఆగమనం తరువాత వారికి అప్పగించాడు. పాలెగాళ్లు సైతం బ్రిటీష్ వారి ఆధీనంలోకి వచ్చారు.
సర్ థామస్ మన్రో పాలెగాళ్ల వ్యవస్థను రద్దు చేశారు.

నరసింహారెడ్డి బ్రిటీష్ వారిపై కత్తి దూయడానికి కారణమిదే..
నాడు కడప జిల్లాలో భాగంగా ఉన్న ఉయ్యాలవాడ గ్రామం నేడు కర్నూలు జిల్లాలో ఉంది. ఉయ్యాలవాడ గ్రామానికి నరసింహారెడ్డి తండ్రి పెద మల్లారెడ్డి నొస్సం సంస్థానికి పాలెగాడుగా ఉన్నారు. పెద మల్లారెడ్డి ముగ్గురు కొడుకుల్లో నరసింహారెడ్డి చిన్నవాడు. వీరి కుటుంబానికి నెలకు రూ.70 భరణంగా బ్రిటీష్ ప్రభుత్వం అందించేది. దీనిలో రూ.35 పెద మల్లారెడ్డి తమ్ముడు చిన మల్లారెడ్డికి పోయేది. మిగిలిన భరణంలో నరసింహారెడ్డికి నెలకు రూ.11.. 10 అణాల 8 పైసల భరణం వచ్చేది. నరసింహారెడ్డి తాత(తల్లి తండ్రి) జయరామిరెడ్డికి నెలకు రూ.1000 భరణం వచ్చేది. అయితే జయరామిరెడ్డికి కుమారులు లేకపోవడంతో ఆయన మరణం తరువాత బ్రిటీష్ ప్రభుత్వం పింఛన్ ఇవ్వకుండా ఆపేసింది. 1846 జూన్ నెలలో తనకు రావల్సిన భరణం బ్రిటీష్ ప్రభుత్వం నిలిపివేయడంతో నరసింహారెడ్డి ఆగ్రహానికి గురయ్యాడు.

నరసింహారెడ్డిని అవమానించిన తహసీల్దార్..
తన నెలసరి భరణం కోసం కోయిలకుంట్ల ఖజానాకు అనుచరుణ్ని పంపించాడు. అక్కడి తహసీల్దార్ రాఘవాచారి నరసింహారెడ్డిని ముష్టివాడితో పోల్చుతూ అతను వస్తే కానీ పింఛన్ ఇవ్వనని తేల్చి చెప్పాడు. ఈ విషయాన్ని అనుచరుడు నరసింహారెడ్డికి చేరవేయడంతో అవమానంగా భావించాడు. ఖజానా మొత్తాన్ని కొల్లగొడతానని దమ్ముంటే ఆపుకోవాలంటూ హెచ్చరిక జారీ చేశాడు. దీంతో భయపడిపోయిన తహసీల్దార్, బ్రిటీష్ సైన్యం సహకారంతో ఖజానా వద్దే ఉండిపోయాడు.

తహసీల్దార్‌ తల నరికేసిన నరసింహారెడ్డి..
అప్పటికే బ్రిటీష్ వారి అరాచకాలతో అల్లాడుతున్న ఇతర సంస్థానాధీశులకు కూడా నరసింహారెడ్డి పోరుబాట గురించి తెలిసింది. వనపర్తి, పెనుగొలను, జటప్రోలు, అవుకు జమీందార్లు, హైదరాబాద్‌కు చెందిన సలాంఖాన్, కర్నూలుకు చెందిన బాబాఖాన్, కొందరు బోయలు, చెంచులు నరసింహారెడ్డికి మద్దతిచ్చారు. 1846 జూలై 7, 8 తేదీల్లో చాగలమర్రి తాలూకా రుద్రవరంపై నరసింహారెడ్డి దాడి చేశాడు. మిట్టపల్లి వద్ద పోలీసులను అటకాయించాడు. ఈ పోరాటంలో 9 మంది నరసింహారెడ్డి అనుచరులు ప్రాణాలు కోల్పోయారు. 1846 జూలై 10 కోయిలకుంట్ల పట్టణంపై దాడి చేశాడు. తహసీల్దార్ కార్యాలయంలో రాఘవాచారిని బంధీగా పట్టుకుని శిరచ్ఛేదన గావించాడు. ట్రెజరీ అధికారికి గుండు గీయించాడు. కాపలావారిని చంపేసి
ఖజానాలో ఉన్న 805 రూపాయల 10 అణాల 4 పైసలను దోచుకుపోయాడు. మార్గమధ్యంలో దువ్వూరు ఖజానాను, చుట్టుపట్ల గ్రామాన్ని సైతం దోచుకున్నాడు. నరసింహారెడ్డి దాడి గురించి తెలుసుకుని బ్రిటీష్ సైన్యం అక్కడికి చేరుకునేప్పటికే అహోబిలం కోటకు చేరిపోయాడు.

వాట్సన్ తల నరికేసిన నరసింహారెడ్డి..
నరసింహారెడ్డి ఆచూకీ కోసం ఖమ్మం తహసీల్దార్‌తో కలిసి కెప్టెన్ నాట్ బయల్దేరాడు. జేహెచ్ కొక్రీన్ మరో దళంతో రుద్రవరం వద్ద కలుసుకునేందుకు సిద్ధమయ్యాడు. నరసింహారెడ్డి కొత్తకోటలోని పాడుబడిన కోటను కార్యాలయంగా మార్చుకున్నాడు. అవుకు రాజు నారాయణ రాజు నరసింహారెడ్డికి సహకరించాడు. బ్రిటీష్ సైన్యానికి, నరసింహారెడ్డి సైన్యానికి మధ్య భీకర పోరు నడిచింది. 200 సైన్యాన్ని కోల్పోయినా భయపడకుండా పారిపోతున్న వాట్సన్ తలను నరికేశాడు.

నరసింహారెడ్డిని పట్టిస్తే రూ.1000 నజరానా..
నొస్సం కోటలో ఉండటం సరికాదని భావించిన నరసింహారెడ్డి తన మకాంను నల్లమల అడవుల్లోని వనదుర్గాన్ని తన స్థావరంగా మార్చుకున్నాడు. అక్కడ అరాచకాలకు పాల్పడుతున్న ఫారెస్ట్ అధికారిని చంపేశాడు. దీంతో నరసింహారెడ్డి పేరు మారుమోగింది. దీంతో నరసింహారెడ్డిని పట్టుకోకుంటే తమకు చాలా నష్టం జరుగుతుందని భావించిన బ్రిటీష్ ప్రభుత్వం ఆయన కోసం అణువణువు గాలించింది. కానీ ఆయన దొరకలేదు. దీంతో నరసింహారెడ్డిని పట్టిస్తే రూ.1000, ఆయన ముఖ్య సలహాదారు గోసాయి వెంకన్నను పట్టిస్తే రూ. 100 నజరానాగా బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా నొస్సం కోటను కూల్చేసింది. విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి తీవ్ర ఆవేదన చెందాడు.

బ్రిటీష్ సైన్యానికి అర్ధరాత్రి చుక్కలు చూపించిన నరసింహారెడ్డి
నరసింహారెడ్డిని నేరుగా పట్టుకోలేమని నిర్ణయానికి వచ్చిన బ్రిటీష్ ప్రభుత్వం ఆయన అన్న కుమారుడు మల్లారెడ్డి సాయాన్ని తీసుకుంది. మల్లారెడ్డి సాయంతో నరసింహారెడ్డి భార్యాపిల్లలను బంధించింది. భార్యాపిల్లల కోసమైనా నరసింహారెడ్డి లొంగిపోతాడని భావించిన బ్రిటీష్ సైన్యానికి అర్థరాత్రి చుక్కలు చూపించి నరసింహారెడ్డి తన భార్యాపిల్లలను విడిపించుకు వెళ్లిపోయాడు.

బ్రిటీష్ వారితో భీకర యుద్ధం..
నరసింహారెడ్డిని లొంగదీసుకునేందుకు బ్రిటీష్ ప్రభుత్వం ప్రజలను హింసించడం మొదలు పెట్టింది. ఇదంతా తన కోసమే జరుగుతోందని తెలుసుకున్న నరసింహారెడ్డి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. నార్తన్ నేతృత్వంలోని బ్రిటీష్ సైన్యానికి 1846 అక్టోబర్ 6న నరసింహారెడ్డి ఆచూకీ లభ్యమైంది. ఆయన ఉంటున్న గుట్టను చుట్టుముట్టింది. కానీ నరసింహారెడ్డి సైన్యం బ్రిటీష్ సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొంది. తమ వద్ద తూటాలన్నీ అయిపోవడంతో నరసింహారెడ్డి నేరుగా కథనరంగంలోకి దిగాడు. అయితే అప్పటికీ నరసింహారెడ్డి తీవ్రంగా గాయపడి ఉండటంతో ఆయన్ను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి బ్రిటీష్ సైన్యానికి పెద్దగా సమయం పట్టలేదు.

30 ఏళ్ల పాటు నరసింహారెడ్డి తల కోట గుమ్మానికి…
తమ బంధీగా ఉన్ననరసింహారెడ్డికి బ్రిటీష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. ఉరి తర్వాత ఆయన శిరస్సును కోయిలకుంట్ల వద్ద బురుజుపై గొలుసులతో బంధించి తూకుమానుకు వేలాడదీయాలని తీర్పు వెలువరించింది. 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు నరసింహారెడ్డికి ఉరి తీయనున్నట్టు బ్రిటీష్ ప్రభుత్వం వెల్లడించింది. జుర్రేటి వాగు వద్ద నరసింహారెడ్డిని బహిరంగంగా ఉరి తీశారు. ఈ ఘటనను వీక్షించిన ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. తీర్పు మేరకు నరసింహారెడ్డి తలను 30 ఏళ్ల పాటు అంటే 1877 దాకా కోయిలకుంట్ల బురుజు వద్ద కోట గుమ్మానికి వేలాడదీసి ఉంచారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here