సీఎంకు లేఖ రాసిన ఆర్టీసీ కండక్టర్.. సంచలనంగా మారిన లేఖ

0
40

సుదీర్ఘ కాలం పాటు సమ్మె చేసి అనంతరం విరమించిన ఆర్టీసీ కార్మికులు.. తమను విధుల్లోకి చేర్చుకోవాలంటూ అధికారుల కాళ్లా వేళ్లా పడుతున్నారు. అయినప్పటికీ కూడా తమకు ఆదేశాలు రాలేదని అధికారులు తిప్పి పంపిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణ అనే ఆర్టీసీ కండక్టర్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎంకు కృష్ణ రాసిన లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలంగాణ వచ్చింది తమ వంటి వారికోసం కాదని.. మీవంటి నాయకుల కోసమేనని కృష్ణ లేఖలో పేర్కొన్నాడు. తన ఆర్టీసీ అక్కా చెల్లెమ్మలు లాఠీ దెబ్బలు తింటారని కలలో కూడా ఊహించలేదని.. వాళ్ల ఉసురు మీకు తప్పకుండా తగులుతుందన్నారు. కృష్ణ రాసిన లేఖ యథాతథంగా…

‘‘గౌరవనీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్‌ గార్కి…
మీకు మాట తప్పడం, మాయ మాటలు చెప్పి మోసం చేయడం తెలుసని మా కార్మిక లోకం లేటుగా తెలుసుకుంది. నా రాజీనామాకు కారణం లేకపోలేదు సార్‌. మా తెలంగాణలో నియంతృత్వం చూస్తానని అనుకోలేదు. 1200మంది ఆత్మహత్య చేసుకుంటే మన కేసీఆర్‌ సార్‌ ఉన్నారు ఆంధ్రా పాలకులు నిజంగా మోసం చేశారేమో, మమ్మల్ని బాగా చూసుకుంటారు అనుకున్నా. కానీ సార్‌.. మా 30మంది కార్మికులు చనిపోతే మీరు కనీసం స్పందించలేదు. అప్పుడు అనిపించింది. సార్‌… తెలంగాణ మా కోసం కాదు కేవలం మీలాంటి నాయకుల కోసమే అని. నా అక్కా చెల్లెమ్మలు లాఠీ దెబ్బలు తింటారని క లలో కూడా ఊహించలేదు సార్‌. కానీ మీ బంగారు తెలంగాణలో అది సాధ్యమైంది సార్‌, నా ఆర్టీసీ అక్కచెల్లెళ్ల ఉసురు కచ్చితంగా మీకు తగులుతుంది సార్‌.

నేను సూర్యాపేట డిపోలో ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నా. మీలాంటి ఒక మోసకారి, ఒక మాటకారి, ఒక మానవత్వం లేని ఒక నిరంకుశ ప్రభుత్వంలో నా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉద్యోగిగా పని చేయలేను. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా. మీ సంస్థ నుంచి నాకు రావాల్సిన బకాయిలను ఇప్పించి నా రాజీనామాను ఆమోదించగలరని మనవి. సీఎం సారూ మీరు ఉద్యమ నాయకుడిగా మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తుకు చేసుకోండి. పాపం ఆర్టీసీ వాళ్లు.. వచ్చే రూ.15వేల వేతనం తీసుకుని ఫ్యామిలీ చూసుకుంటూ గౌరవంగా బతుకుతున్నారు. మీరు వాళ్లకు ఏమీ ఇవ్వకున్నా కనీసం పిలిచి మాట్లాడి ఉంటే మీ మీద గౌరవంతో ప్రాణాలిచ్చేవారు. కనీసం నేను మీ బంగారు తెలంగాణలో సంతోషంగా లేను. మా తల్లిదండ్రులకైనా ప్రతినెలా వృద్ధాప్య పింఛన్‌ ఇవ్వండి.

ఎందుకంటే వారు మిమ్మల్ని నమ్మి మా కేసీఆర్‌ అని ఓటు వేశారు. ప్రతిరోజు ఈ అరెస్టులు ఏంది? ఈ లాఠీ దెబ్బలు ఏంది? నా ఆర్టీసీ సోదరులు ఏం తప్పు చేశారు? ఇంకా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకునేటట్లు చేస్తారు? నా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చేయలేను. నేను మీ బంగారు తెలంగాణలో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగిని కాదు. మీ మాయ మాటలు నమ్మి మోసపోయిన వ్యక్తిని. మీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిగా ఉన్నాను కాబట్టి నా తల్లిదండ్రులకు వృద్ధాప్య పింఛన్‌ ఒకటి ఇవ్వండి. నా పేరు మీద సెంటు భూమి లేదు. కాబట్టి మూడెకరాల పొలం ఇవ్వండి. నాకు ఉండటానికి ఇల్లు లేదు కాబట్టి డబుల్‌బెడ్‌ రూం ఇల్లు ఇవ్వండి. ఒకవేళ మీరు ఏమీ ఇవ్వకున్నా సమాజంలో గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలని కోరుతూ నా ఉద్యోగ రాజీనామాను తక్షణమే ఆమోదించగలరు.

ఇట్లు,
ఎల్‌.కృష్ణ, స్టాఫ్‌ నంబర్‌ 176822
ఆర్టీసీ కండక్టర్‌, సూర్యాపేట డిపో’’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here