ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయి లేదు’: హైకోర్టుకు అధికారుల అఫిడవిట్

0
160

ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో అధికారులు హైకోర్టుకు అఫిడవిట్లు సమర్పించారు. ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఈ అఫిడవిట్లను దాఖలు చేశారు. ఆర్టీసీకి రూ.3006కోట్లు ప్రభుత్వం బకాయి పడగా… రూ.3,903 కోట్లు చెల్లించిందన్నారు.

ఈ నేపథ్యంలో ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయిలేదని రామకృష్ణారావు నివేదికలో పేర్కొన్నారు. మోటారు వాహనాల పన్ను కింద ఆర్టీసీయే తిరిగి ప్రభుత్వానికి రూ.540కోట్లు చెల్లించాలని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆనవాయితీగా వివిధ పద్దుల కింద ఆర్టీసీకి నిధులు ఇస్తున్నామని.. రుణం పద్దు కింద ఇచ్చిన నిధులు వాస్తవానికి విరాళమేనని తేల్చి చెప్పారు.

దీనిపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ.. రవాణాశాఖ మంత్రికి సెప్టెంబర్‌ 11న ఆర్థికాంశాలు వివరించామని తెలిపారు. మరిన్ని నిధులు రాబట్టాలనే ఉద్దేశంతోనే సర్కారు నుంచి కొంత సొమ్ము రావాలని చూపించామన్నారు. ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన దానికంటే రూ.867 కోట్లు ఎక్కువే వచ్చాయని తెలిపారు.

జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితిని బట్టే ఆర్టీసీకి సాయం చేశామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2014-15లో మిగులు బడ్జెట్‌ ఉంటే ఆర్టీసీకి నిధులిచ్చామన్నారు. 2015-16 నుంచి జీహెచ్‌ఎంసీ లోటు బడ్జెట్‌లోనే కొనసాగుతోందని చెప్పారు. చట్టం ప్రకారం ఆర్టీసీకి నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని లోకేశ్‌కుమార్‌ వివరించారు. నిధులపై ఆర్టీసీ వినతిని అంగీకరించే ఆర్థిక పరిస్థితి జీహెచ్‌ఎంసీకి లేదని అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here