ఆర్టీసీ సమ్మె: ఈ పాపం ఎవ్వరిది?

0
83

ఆర్టీసీ సమ్మె ప్రారంభమై దాదాపు 50 రోజులు కావొస్తోంది. ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ కూడా పూర్తైంది. ఇంతకాలం కోర్టు తీర్పుపై ఆశ పెట్టుకుని ఉన్న కార్మికులకు నిన్నటి తీర్పు అగమ్యగోచరంగా మారింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో కార్మికులు ఉన్నారు. చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. సమ్మె చట్ట విరుద్ధమని చెప్పలేమని.. అయితే దానిని లేబర్ కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. దీంతో ఆర్టీసీ కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

ఒకప్పుడు వెన్నుదన్నుగా నిలిచిన బీజేపీ వెనకడుగు వేసింది.. ఆర్టీసీ సమ్మెపై కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మద్దతునైతే ప్రకటించలేదు కానీ సమ్మె ప్రారంభం నుంచి బీజేపీ అంతా తానై నడిపించింది. ప్రస్తుతం మాత్రం కారణాలేవైనా ఆ పార్టీ వెనక్కి తగ్గిందనే చెప్పాలి. కోర్టు వాయిదాలు.. ప్రభుత్వం మొండి వైఖరి.. మరోవైపు ఉద్యోగం పోతుంది.. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలనే భయంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ఒక అడుగు వెనక్కి వేసి ప్రధాన డిమాండ్ మినహా ఇతర డిమాండ్లపై చర్చకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు పిలవాలంటూ ఆర్టీసీ కార్మికులు సరికొత్త స్లోగన్ అందుకున్నారు.

కొందరి స్వార్థానికి ఆర్టీసీ కార్మికులు బలయ్యారా?
కొందరు ఆర్టీసీ జేఏసీ కీలక నేతల కారణంగా ఆర్టీసీ కార్మికులు బలయ్యారనే వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. దసరా పండుగ నేపథ్యంలో సమ్మె చేస్తే ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది.. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరిస్తుందనే ఓ కారణాన్ని చూపి నేతలు కార్మికులను సమ్మెలోకి దించినట్టు తెలుస్తోంది. ఈ సమ్మె నేపథ్యంలో ప్రజలు విపరీతంగా ఇబ్బందులకు గురికావడంతో సమ్మె పట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందనే చెప్పాలి.

ఏది ఏమైనా కొందరు ఆర్టీసీ జేఏసీ నేతల అత్యుత్సాహమో.. లేదంటే ఏదైనా ప్రలోభాలకు లొంగి గుడ్డిగా కార్మికులను సమ్మె వైపు నడిపించారో కానీ మొత్తానికి ఈ ఆర్టీసీ సమ్మె ఎపిసోడ్‌లో బలి పశువులయ్యింది మాత్రం సాధారణ కార్మికులేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అనాలోచిత నిర్ణయాలతో సాధారణ కార్మిక కుటుంబాలను రోడ్డున పడేసిన పాపం ఎవ్వరిదనేది ఓపెన్ సీక్రెట్. ప్రస్తుతం దయతలచి ప్రభుత్వం ఉద్యోగాలివ్వాలి తప్ప మరో మార్గం లేదు. ఇక మీదట తమ జీతాల విషయంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితి కూడా కార్మిక కుటుంబాలకు లేకుండా పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here