విధుల్లో చేరేందుకు తరలి వస్తున్న ఆర్టీసీ కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

0
229

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు డిపోలకు తరలి వస్తున్నారు. అయితే తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని అధికారులు వారిని విధుల్లో చేర్చుకోవడం లేదు. పోలీసులు సైతం కార్మికులను అడ్డుకుంటుండటంతో డిపోల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదంతో పాటు పలు చోట్ల ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. సంగారెడ్డి జిల్లా

నారాయణఖేడ్ బస్సు డిపో దగ్గర 80 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు, కార్మికులకు మధ్య పెనుగులాట జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరు కార్మికులు స్పృహ తప్పి పడిపోయారు. వారిని తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించారు.

హకీంపేట, కంటోన్మెంట్‌ డిపోల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. విధుల్లో చేరేందుకు వెళ్లిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకొంటుండటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు హయత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌ ఆర్టీసీ డిపోల దగ్గర భారీ భద్రత చర్యలను పోలీసులు చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు కొందరు తాత్కాలిక సిబ్బందిని అడ్డుకున్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్ పోలీసు స్టేషన్‌లో భీమ్లా అనే ఆర్టీసీ కార్మికుడు నురగలు కక్కుకుని కిందపడిపోయాడు.

సంగారెడ్డి డిపోలో భీమ్లా కండక్టర్‌గా పని చేస్తున్నాడు. ఉదయం విధులలో చేరేందుకు సంగారెడ్డి డిపోకు వచ్చిన భీమ్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగానే భీమ్లా నురగలు కక్కుకుని కింద పడిపోయాడు. హుటాహుటిన భీమ్లాను తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆర్టీసీ కార్మికుడు మృతి చెందాడు.

ఎడపల్లి మండలం మంగల్ పాడ్ గ్రామానికి చెందిన రాజేందర్(50) బోధన్ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నిన్న ఉదయం గుండెనొప్పితో నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. నిన్న సాయంత్రం ప్రభుత్వ సమ్మెపై చేసిన ప్రకటనతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here