మహా పీఠాన్ని అధిరోహించిన ఉద్దవ్ ఠాక్రే.. ఇదంతా ఆమె వల్లనే

0
136

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే గురువారం సాయంత్రం శివాజీ పార్కులో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ చేతుల మీదుగా ప్రమాణస్వీకారం చేశారు. అంతేకాకుండా శివసేన కాంగ్రెస్‌ ఎన్సీపీల త్రిపక్ష కూటమికి చెందిన ఆరుగురు నేతలు మంత్రులుగా.. ఎన్సీపీ నుంచి జయంత్‌ పాటిల్‌, ఛగన్‌ భుజ్‌బల్‌; కాంగ్రెస్‌ నుంచి బాలాసాహెబ్‌ థోరట్‌, నితిన్‌ రౌత్‌; శివసేన నుంచి ఏక్‌నాథ్‌ షిండే, సుభాష్‌ రాజారాం దేశాయ్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, కేంద్రమంత్రి రాందాస్‌ అఠవాలే డీఎంకే అధినేత స్టాలిన్‌, కాంగ్రెస్‌ ముఖ్య నేతలు అహ్మద్‌ పటేల్‌, మల్లిఖార్జున ఖర్గే, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ‌, ఎంఎన్‌ఎస్‌ అధినేత రాజ్‌ఠాక్రే, ఎన్సీపీ నేతలు అజిత్‌ పవార్‌, ప్రఫుల్‌ పటేల్‌ తదితరులు హాజరయ్యారు. అంతేకాకుండా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు అభినందనలు తెలుపుతూ ఉద్దవ్ కు లేఖలు పంపారు.

ప్రమాణస్వీకారానికి ముందు ఉద్ధవ్‌ ఛత్రపతి శివాజీ విగ్రహానికి ప్రణమిల్లారు. సీఎం పదవి చేపట్టిన తొలి ఠాక్రే కుటుంబ వ్యక్తి ఉద్ధవే అవడం విశేషం. గతంలో శివసేన పార్టీ నుంచి 1995లో మనోహర్‌ జోషీ 1999లో నారాయణ్‌ రాణె సీఎంలుగా పనిచేశారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత 2019 లో శివసేన పార్టీకి సీఎం పదవి దక్కింది.

అక్టోబర్‌ 24న ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. నెలరోజులకు పైగా ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంపై ఉత్కంఠ కొనసాగింది. మధ్యలో అనూహ్యంగా ఫడణవీస్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినా.. అనేక మలుపులు తిరిగి చివరికి శివసేన పార్టీ నుంచి ఉద్దవ్ ఠాక్రే మహా పీఠాన్ని అధిరోహించారు.

రష్మీ ఠాక్రే

రాజకీయాలంటే ఆసక్తి లేని ఉద్దవ్ తర్వాత తన భార్య రష్మీ ప్రోద్భలంతో రాజకీయాల్లోకి వచ్చినా.. మొదట్లో తండ్రి చాటు బిడ్డగా ఉండేవారు. కానీ ఆపై శత్రువులను వ్యూహాత్మకంగా దెబ్బ తీసి తండ్రి సారధ్యంలో పార్టీని నడిపారు. బాల్ ఠాక్రే చనిపోయిన తర్వాత ఆయనొక్కడే పార్టీ భాద్యతలను నిర్వహించారు. అయితే ఉద్దవ్ సీఎం అవడానికి మరియు రాజకీయాల్లో ఉద్ధవ్‌ విజయం వెనుక ఆయన భార్య రష్మీ ఠాక్రే పాత్ర ఎంతో ఉందని సన్నిహితులు చెబుతుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here