అమ్మే కదాని వెళితే పాశవికంగా హత్య చేసింది.. వీడిన దీప్తిశ్రీ మర్డర్ మిస్టరీ

0
238

అమ్మే కదా అని వెళ్లిన ఆ చిన్నారి కథ అత్యంత దయనీయంగా ముగిసింది. తన కూతురికి తల్లి లేని లోటు తెలియకుండా పెంచాలనుకున్న ఆ తండ్రి ఆశలు అడియాసలయ్యాయి. తల్లిలా కడుపులో పెట్టుకుని చూసుకుంటుందనుకుంటే.. గొంతు నులిమి హత్య చేసి.. మూటగట్టి ఉప్పుటేరులో పడేసింది. విషయం తెలుసుకున్న ఆ తండ్రి ఆవేదనకు అంతు లేకుండా పోయింది. తన బంగారు తల్లిని హత్య చేసిన తన భార్యను నడిరోడ్డుపై ఉరి తీయాలంటూ పోలీసు ఉన్నతాధికారులను వేడుకున్నాడు.

అసలేం జరిగింది?
కాకినాడ రూరల్‌ మండలం యానాం రోడ్డులో పగడాలపేటకు చెందిన సూరాడ సత్యశ్యామ్‌కుమార్‌, సత్యవేణి దంపతుల ముద్దుల కూతురు దీప్తిశ్రీ ఇషాని(7). నాలుగేళ్ల క్రితం సత్యవేణి మరణించడంతో.. కాకినాడలోని సంజయ్‌నగర్‌కు చెందిన శాంతికుమారిని శ్యామ్‌ రెండేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు(13 నెలల). కొడుకు పుట్టిన నాటి నుంచి శాంతికుమారి దీప్తికి నరకం చూపించడం ప్రారంభించింది. చేతులు, కాళ్లపై వాతలు పెడుతూ హింసించింది. దీంతో శ్యామ్ తన కూతురిని తన తల్లి వద్ద ఉంచి చదివిస్తున్నాడు. జగన్నాథపురంలోని నేతాజీ మున్సిపల్‌ పాఠశాలలో దీప్తిశ్రీ రెండో తరగతి చదువుతోంది. కూతురి ఆలనా పాలన చూస్తున్నందుకు తల్లికి నెలకు రూ.2 వేలు పంపిస్తున్నాడు. దీనిని కూడా శాంతి కుమారి జీర్ణించుకోలేకపోయింది. తరచూ భర్తతో కూతురి విషయంలో గొడవకు దిగేది. ఈ క్రమంలోనే దీప్తి చదివే పాఠశాలకు వెళ్లి ఆమెను స్కూలు నుంచి బయటకు తీసుకువచ్చింది. తన పుట్టింటికి తీసుకెళ్లి దీప్తి మెడకు టవల్ బిగించి హత్య చేసింది. అనంతరం శవాన్ని గోనెసంచిలో కుక్కి ఆటోలో తీసుకెళ్లి ఉప్పుటేరులో పడేసింది.

బయటపడిందిలా…
దీప్తిని స్కూలు నుంచి తీసుకు వచ్చేందుకు శ్యామ్ స్కూలుకు వెళ్లాడు. కానీ దీప్తి కనిపించలేదు. ఆరా తీస్తే తన భార్యే తీసుకెళ్లిందని తెలిసింది. తరచూ దీప్తి విషయంలో గొడవ చేసే భార్య పాపను ఏదో చేసి ఉంటుందని అనుమానించిన శ్యామ్ భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు కొంత వరకూ విషయం అర్థమైంది. అనంతరం శాంతి కుమారి విచారిస్తే మొదట బుకాయించిన ఆమె.. అనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారించగా విషయం మొత్తం బయటపెట్టింది. పోలీసుల విచారణలో భాగంగా గతంలో తన తల్లితో కలిసి శాంతి కుమారి తండ్రిని హత్య చేసినట్టు తెలిసింది.

నా భార్యను నడిరోడ్డుపై ఉరి తీయండి..
పోలీసులతోపాటు ధర్మాడి సత్యం బృందం ఉప్పుటేరులో ఇంద్రపాలెం నుంచి కస్టమ్స్‌ ఆఫీస్‌ వరకు నాలుగు రోజుల పాటు గాలించారు. ఉప్పుటేరు వద్ద గుర్రపుడెక్క కింద దీప్తిశ్రీ మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం రెవెన్యూ అధికారుల సమక్షంలో చిన్నారి దీప్తిశ్రీ మృతదేహానికి శవపంచనామా చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. ఎస్పీ అద్నన్‌ నయీం అస్మీ.. శ్యామ్‌ను అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భార్యను నడిరోడ్డుపై ఉరి తీయాలంటూ ఎస్పీని శ్యామ్‌ ప్రాధేయపడ్డాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here