తహసీల్దార్ హత్య.. తనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి

0
19

తహసీల్దార్ హత్య అనంతరం తనపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఖండించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను బాధతో ఈ ప్రెస్ మీట్ పెట్టాను. నిందితులని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతాను. రాజకీయంగా లబ్ధి పొందడానికి మీడియాని తప్పుదోవ పట్టిస్తున్నారు. మల్‌రెడ్డి సోదరులు శవం వద్ద కూడా మీడియాలో నాపై ఆరోపణలు చేస్తున్నారు. నాపై మూడు సార్లు ఓడిపోయిన వ్యక్తి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.

తహసీల్దార్ మృతిపై పోలీసులు తమ పని తాము నిర్వహిస్తున్నారు. మల్‌రెడ్డి రంగారెడ్డి బ్రదర్స్ చేసిన కబ్జాకు సంబంధించిన అన్ని రకాల ఆధారాలతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ముద్దాయి సురేష్ వాళ్ల కుటుంబ సభ్యుల వద్ద నుంచి మల్‌రెడ్డి కుటుంబ సభ్యులు భూమి కొన్నారు. ఆయన చేసిన తప్పులని కప్పిపుచ్చుకునేందుకే నాపై బురద జల్లుతున్నాడు.

ఇద్దరు ముస్లింలపై టెనెంట్ చేయించి వారి నుండి మల్‌రెడ్డి కుటుంబ సభ్యులు 16 ఎకరాల వరకు కొనుక్కున్నారు. మళ్ళీ దుర్గయ్య, కృష్ణయ్య దగ్గర ఉన్న ఒక ఎకరా కూడా కొన్నారు. పాస్ బుక్‌ల కోసం తహసీల్దార్ దగ్గరకు వెళ్లి ఒత్తిడి చేయటం జరిగింది. సురేష్ వాళ్ల కుటుంబ సభ్యులు భూమి అమ్మిన విషయం అతనికి తెలియదు. సదరు 412 ఎకరాలపై పూర్తి విచారణ చేయాలని సీఎంకి, సీఎస్, డీజీపీకి ఫిర్యాదు చేస్తాను.

నాపై ఆరోపణలు వస్తే నిరూపించండి. ఒక తహసీల్దార్‌కి లంచం ఇచ్చి పనులు చేయించుకునే స్థితిలో నేను లేను. పలు గ్రామాల్లో ఎస్సీల భూములు అమ్ముకుని కనీసం వాళ్ళకి గుడి కూడా లేకుండా చేశారు. ఒక శవం దగ్గర నాపై ఆరోపణలు చేయడం మూలాన నేను ఈ రోజు స్పందించడం జరుగుతోంది. ఆ భూమిని 40 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న వారికి సదరు భూమి చెందాలని నేను కోరుకుంటున్నాను’’ అని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here