9 నెలల చిన్నారి హత్యాచారం కేసు సుప్రీమ్ కోర్ట్ కి అప్పీల్.. శిక్ష కోసమే అంటున్న పోలీసులు

0
84

దిశ కేసులో ఎన్‌కౌంటర్‌ తర్వాత జనం నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో వరంగల్‌ పోలీసులు 9 నెలల చిన్నారి హత్య కేసులో దోషి ప్రవీణ్‌కు శిక్ష తగ్గించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. మానవ మృగానికి హైకోర్ట్ శిక్ష తగ్గించడాన్ని సవాల్ చేస్తూ మరణ శిక్ష కోసమే సుప్రీమ్ కోర్ట్ కు అప్పీల్ చేస్తున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ప్రకటించారు. 2019 జూన్‌లో హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిపై ప్రవీణ్ హత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే.

జూన్‌ 17 రాత్రి చిన్నారి కుటుంబ సభ్యులు డాబాపైన నిద్రిస్తుండగా.. పొత్తిళ్ళలో ఉన్న పాపను ప్రవీణ్ ఎత్తుకెళ్లాడు. అర్ధరాత్రి 1.30 గంటల తర్వాత తల్లి రచనకు మెలకువ రాగా… పక్కనే పాప లేదని గ్రహించి ఆందోళన చెందింది. రచన తమ్ముడు భరత్‌ బైక్‌పై వెతకడానికి వెళ్లగా.. ఇంటి పక్క గల్లీలో ప్రవీణ్‌ భుజాన టవల్‌లో చుట్టుకుని పాపను తీసుకెళ్తున్నట్లు గుర్తించి కేకలు వేశాడు. దీంతో ప్రవీణ్‌ పాపను ఒక్కసారిగా నేలపై విసిరేసి పారిపోతుండగా.. భరత్‌ ప్రవీణ్‌ను పట్టుకుని చితకబాదాడు.

అప్పటికే చిన్నారిలో ఎలాంటి కదలికా లేదు. శరీరం నుంచి అధికంగా రక్తం పోవడంతో అక్కడికక్కడే చనిపోయిందని వైద్యులు తెలిపారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రవీణ్‌.. చిన్నారిపై అత్యాచారం చేయడమే కాకుండా ఊపిరి ఆడకుండా చేసి హతమార్చినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. పసికందు హత్యతో ప్రవీణ్‌ను ఉరి తీయాలంటూ జనం ఆందోళనకు దిగారు.

మొదటి రెండు నెలల్లోనే కోర్ట్ లో విచారణ పూర్తవగా వరంగల్‌ జిల్లా అదనపు కోర్టు నిందితుడు ప్రవీణ్ కు ఉరిశిక్ష విధించింది. తర్వాత ప్రవీణ్ హైకోర్ట్ కు పిటిషన్ పెట్టుకోవడంతో ప్రవీణ్‌కు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా సవరిస్తూ హైకోర్ట్ తీర్పునిచ్చింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులతో పాటు సమాజంలోని చాలా వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత ప్రవీణ్‌ ని కూడా అలాగే చంపేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here