హాట్ హాట్ మల్కాజ్‌‌గిరి! గెలుపెవరిది..?

0
1254

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి హుషారు మీదున్న టీఆర్ఎస్ పార్టీ అదే జోష్‌లో లోక్ సభ ఎన్నికల కోసం సమాయత్తమైంది. ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ప్రచార పర్వాలు ముగియడంతో ఇక ఎక్కడెక్కడ ఏయే పార్టీల అభ్యర్థులకు అనుకూలతలు కనిపిస్తున్నాయనే దానిపై ఇటు విశ్లేషకులు, అటు జనాలు లెక్కలేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో హాట్ సీటు మల్కాజిగిరి పై అందరి దృష్టి పడింది. ఎందుకంటే ఇది దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజవర్గం. పైగా అన్ని మతాలు, కులాలు, వర్గాలు కలగలిసి ఉంటున్న నియోజకవర్గం. మల్కాజ్ గిరిలో ఉన్న అపార జనాభా ప్రతీసారి ఓ విలక్షణ తీర్పునిస్తున్నారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఏ పార్టీ ఇక్కడ రెండోసారి గెలవలేదు. టీఆర్ఎస్ హవా సాగిన గత ఎన్నికల్లో టీడీపీ నుంచి మల్లారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరి అసెంబ్లీ అభ్యర్థిగా గెలుపొంది మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. ఇప్పుడేమో మల్కాజ్‌గిరి ఎంపీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన అల్లుడు మర్రిరాజశేఖర్ రెడ్డి బరిలోకి దింపారు.

ఇక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉద్దండుడైన రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచే బరిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గెలుపుపై ధీమా ఉన్నట్లేనని తెలుస్తోంది. మల్కాజ్‌గిరి ప్రజలు వినూత్నంగా ఆలోచించడంలో దిట్ట. కాబట్టి వార్ వన్ సైడ్ కాకుండా ప్రశ్నించే గొంతు ఉండాలని వారంతా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారంతా రేవంత్ వైపే మొగ్గు చూపుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఇక ఇక్కడి నుంచి బీజేపీ తరఫున ఎన్.రామచంద్రారావు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన ప్రభావమైతే పెద్దగా కనిపించడం లేదు. చూడాలి మరి ఈ ఉత్కంఠ పరిస్థితుల మధ్య రాష్ట్రంలోనే హాట్ స్థానంగా పేరొందిన మల్కాజ్‌గిరిలో గెలుపెవరిని వరించేనో..!

ఓ సారి మల్కాజ్‌గిరి లోక్ సభ నియోజకవర్గం చరిత్రను పరిశీలిస్తే..

2009లో నియోజకవర్గం అవతరించింది. ఇప్పటి వరకు రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ గెలుపు సాధించాయి. ఇక్కడ అన్ని మతాల వారితో పాటు కార్మికులు ఎక్కువగానే ఉంటారు. దీంతో ప్రతీసారి ఇక్కడ గెలుపు కోసం అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతుంటారు. మేడ్చల్, మల్కాజ్ గిరి, కుత్భుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్, ఎల్.బి.నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలు ఇందులో మిళితమై ఉంటాయి. ఇక్కడి ఓటర్ల సంఖ్య దాదాపుగా 30 లక్షల 90 వేలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here